Centre to help Andhra Pradesh amid heavy rains in state | అమరావతి: ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాల ప్రస్తుత పరిస్థితి, కేంద్రం నుంచి కావాల్సిన సాయంపై చర్చించారు. ఏపీ, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులనుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఏపీ, తెలంగాణలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 
ఏపీకి కేంద్ర ప్రభుత్వం సాయం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వర్షాలు, వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న అమిత్ షా.. కేంద్ర నుంచి అవసరమైన సహాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఏపీలో వరద పరిస్థితిని తెలిపారు చంద్రబాబు. అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఏపీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు కావాలని చర్చించారు.


10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది ఉండగా, ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు ఉంటాయి. సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయంలోపు అంతా విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ చంద్రబాబుకు తెలిపారు. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఏపీకి రానున్నాయి. సహాయక చర్యలకు 10 హెలికాఫ్టర్లు పంపుతున్నారు. సోమవారం నుండి ఏపీలో సహాయక చర్యల్లో హెలికాప్టర్లను వినియోగించనున్నారు.
Also Read: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు ఇవే


తెలంగాణ అధికారులను అభినందించిన ప్రధాని మోదీ


సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదలతో వాటిల్లిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన తక్షణ సహాయక చర్యలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరించారు. మున్నేరు పొంగి పొర్లడంతో ఖమ్మం జిల్లాలో ఎక్కువ  నష్టం సంభవించిందని ప్రధానికి రేవంత్ వివరించారు. అయితే ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రధాని మోదీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్రం తరపున తెలంగాణకు అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామన్న ప్రధాని మోదీ చెప్పారు.


Also Read: Chandrababu: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు, ఫోన్లోనే బాలయ్యకు విషెస్