AP CM Chandrababu skips 50 Years Of Balakrishna Event | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దయింది. భారీ వర్షాల కారణంగా చంద్రబాబు తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు. వరదల కారణంగా టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు రావటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వియ్యంకుడు బాలయ్యతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు... అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ కలెక్టరేట్ ను తాత్కాలిక సీఎం కార్యాలయంగా మార్చుకున్నారు చంద్రబాబు. అవసరమైతే బస్సులోనే ఇవాళ సీఎం చంద్రబాబు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు అని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్ లో జరుగుతున్న బాలయ్య ఈవెంట్‌కు హాజరు కాలేకపోతున్నాను. బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.


ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ


కృష్ణానది వరద ప్రవాహం ఉదృతంగా చేరుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.  ప్రకాశం బ్యారేజి  రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 10.5 లక్షల  నుంచి 11 లక్షల క్యూసెక్కులు బ్యారేజీకి వరద చేరే అవకాశం ఉందన్నారు.


ఆదివారం రాత్రి 7 గంటల నాటికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం క్యూసెక్కుల్లో 


శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.55 లక్షల క్యూసెక్కులు


నాగార్జునసాగర్  వద్ద ఇన్ ఫ్లో 4.73లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.89 లక్షల క్యూసెక్కులు


పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.05లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 5.51లక్షల క్యూసెక్కులు


ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.25 లక్షల క్యూసెక్కులు ఉందని కూర్మనాథ్ తెలిపారు. 


 కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఎండి కూర్మనాథ్ కోరారు. భారీ వర్షాలు కురుస్తున్నందున బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వరద నీటిలో  చేపలు పట్టడం, ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయకూడదన్నారు. 


Also Read: Andhra Pradesh: ప్రాణనష్టం జరిగాక బోటులో చంద్రబాబు షికార్లు - ఏపీ సీఎంపై వైసీపీ సంచలన పోస్ట్ 


భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల వరదలకు రోడ్లు కొట్టుకుపోవడం, రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకల్ని నిలిపివేశారు. ఆర్టీసు బస్సు సర్వీసులు సైతం నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే లైన్ కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది.