Hindu Teachers in Bangladesh: బంగ్లాదేశ్‌లో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా పెద్దగా మార్పు ఏమీ రాలేదు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అటు మహమ్మద్ యూనస్ కూడా వెంటనే ఈ దాడులు ఆపేయాలని పిలుపునిచ్చారు. అయితే...హిందూ టీచర్స్‌ని టార్గెట్‌గా చేసుకుంటున్నారు ఆందోళనకారులు. తక్షణమే వాళ్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. ఫలితంగా దాదాపు 49 మంది ఉపాధ్యాయులు అప్పటికప్పుడు రిజైన్ చేయాల్సి వచ్చింది. వెంటనే వాళ్ల రాజీనామా లేఖని సమర్పించారు. ఇది అనధికారికంగా తెలిసిన లెక్క మాత్రమే. నిజానికి ఇంత కన్నా ఎక్కువ మందే రాజీనామా చేసినట్టు సమాచారం. 


బంగ్లాదేశ్‌లో ఎంతో ఫేమస్ అయిన బకేర్‌గంజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శుక్లా రాణి హల్దేర్ రిజైన్‌ చేయడం సంచలనమైంది. ఆమె ఆఫీస్ ముందు ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఫలితంగా ఆమె వెంటనే విధుల నుంచి తప్పుకున్నారు. ఓ తెల్ల కాగితంపైన "I Resign" అని రాసి సంతకం పెట్టారు. ఆ  ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆగస్టు 18వ తేదీన ఇదే విధంగా పలు కాలేజ్‌ల ఎదుట ఆందోళనలు జరిగాయి. అక్కడి లెక్చరర్‌లూ రాజీనామా చేయాల్సి వచ్చింది. 


ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి పారిపోవడం తప్పించి మరే గత్యంతరమూ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందూ ఉపాధ్యాయులు. ఒత్తిడి చేసి విధుల నుంచి తప్పిస్తున్నారని అంటున్నారు. అంతే కాదు. హిందువులు కనిపిస్తేనే శత్రువులుగా చూస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగోలేవని, ఏం చేయాలో అర్థం కావడం లేదని వివరిస్తున్నారు. ఈ సంక్షోభంపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. 


"బంగ్లాదేశ్‌లో టీచర్లను బలవంతంగా విధుల నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించిన జర్నలిస్ట్‌లు, మంత్రులు, అధికారులను వెతికి మరీ చంపుతున్నారు. కొంతమందిని తీవ్రంగా వేధిస్తున్నారు. జైళ్లలో పెడుతున్నారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్‌లు సూఫీ ముస్లింలకు చెందిన దర్గాలను కూల్చివేస్తున్నారు. యూనస్ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాపాడడంలో విఫలమవుతోంది"


- తస్లిమా నస్రీన్, రచయిత్రి


నెల రోజులకు పైగా బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్ కోటా విషయమై అంతంత మాత్రంగా మొదలైన ఆందోళనలు రానురాను తీవ్రమయ్యాయి. ప్రభుత్వంపై విద్యార్థులు తిరగబడ్డారు. ప్రధాని షేక్ హసీనా ఇంటిపైన, పార్లమెంట్‌పైనా దాడులు చేశారు. చేసేదేమీ లేక షేక్ హసీనా వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తరవాత అక్కడి నుంచి భారత్‌కి వచ్చారు. భారత్ ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్లీ అమెరికాకి వెళ్తారని అనుకున్నా ఆ దేశం ఆమె వీసాని రద్దు చేసింది. ఫలితంగా భారత్‌లోనే ఉండిపోయారు షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ప్రకటించిన వెంటనే అక్కడికి వెళ్లిపోతారని ఆమె కుమారుడు వెల్లడించారు. 


Also Read: Viral News: అరుదైన గుర్రాలను గిఫ్ట్‌గా ఇచ్చిన పుతిన్‌, తెగ మురిసిపోతున్న కిమ్‌