Konaseema Police Intelligence Failure : పచ్చగా ఉండే కోనసీమ మొత్తం ఎర్రబడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా దాడులు, దహనాలు చోటు చేసుకున్నాయి. రాళ్ల దాడి జరిగింది. చివరికి ఎస్పీని వదిలి పెట్టలేదు. బస్సులు కనిపిస్తే నిప్పు పెట్టారు. మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంటినీ వదిలి పెట్టలేదు. చివరికి మంత్రి కొత్తగా కట్టుకుంటున్న ఇంటినీ వదల్లేదు. కొద్ది రోజులుగా అమలాపురంలో ఆందోళనలు జరుగుతున్నా... ఇంత స్థాయి రియాక్షన్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే.. ఈ ఆందోళనల వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ఏ ఒక్క పక్షమూ పేరు మార్పును వ్యతిరేకించలేదు. 



అందుకే ఎవరి మద్దతు లేదని ఆందోళనలుపూర్తి స్థాయిలో జరగవని ప్రభుత్వం ఊహించినట్లుగా ఉంది. కానీ అక్కడ జరిగింది వేరు. వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయి. ముందుగా కలెక్టరేట్ పై.. ఆ తర్వాత మంత్రులు.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇంత జరుగుతున్న విషయాన్ని పోలీసులు కనీసం గుర్తించలేకపోయారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఈ విషయంలో ఘోరంగా ఫెయిలయిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇంతపెద్ద విధ్వంసం జరుగుతుందని తెలిస్తే.. పోలీసుశాఖలో ఉన్న అన్నిరకాల వ్యవస్థల్లో.. ఏ ఒక్క దానికైనా సమాచారం అందుతుంది.  దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురంలో జరిగిన ఘర్షణల విషయంలో అలాంటి కనీస సమాచారం పోలీసు శాఖకు అందలేదు. అంటే ఇంటలిజెన్స్ ఎంత ఘోరంగా ఫెయిలయిందో అర్థం చేసుకోవచ్చు. 



ఆందోళనకారులు విరుచుకుపడబోతున్నారన్న కనీస సమాచారం ఉన్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉద్రిక్తలు ఉన్నా.. అమలాపురంలో పోలీసులు మూడు వందల మంది మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదనపు పోలీసు బలగాలు లేవు. దీంతో ఆందోళనకారులకు ఎదురు లేకుండా పోయినట్లయింది. పోలీసులు చేతులెత్తేశారనన ప్రచారం జరగడం.. స్వయంగా ఎస్పీ సుబ్బారెడ్డి కూడా గాయాలపాలయ్యారని ప్రచారం జరగడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. భయం లేకుండా దాడులకు పాల్పడ్డారు. ఇంకా వైపల్యం ఏమిటంటే.. విధ్వంసం ప్రారంభమైన తర్వాత కూడా పోలీసు బలగాలు.. పెద్ద ఎత్తున చేరుకోలేకపోయాయి. సమన్వయం లేకపోవడంతో చీకటి పడిన తర్వాతనే వచ్చాయి. అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. 



పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలం కావడం ఇదే మొదటి సారి కాదు. విజయవాడలో ఉద్యోగులునిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విషయంలోనూ ఇంటలిజెన్స్ ఘోరంగా విఫలమయిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అమలాపురం విషయంలోనూ అదే పరిస్థితి. ఏపీలో శాంతి భద్రతలు రిస్క్‌లో పడినట్లయిందన్న విమర్శలు రావడానికి ఇంటలిజెన్స్ వైఫల్యం  కారణంగా మారింది.