Delhivery Listing Price: గురుగ్రామ్‌ కేంద్రంగా సేవలందించే ఈ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ సప్లయర్‌ డెల్హీవరీ మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైంది. ఇష్యూ ధర రూ.487తో పోలిస్తే 1.7 శాతం ప్రీమియంతోనే షేర్లు లిస్ట్‌ అయ్యాయి. బీఎస్‌ఈలో 1.2 శాతం ప్రీమియంతో రూ.493, ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతంతో రూ.495.2 వద్ద నమోదయ్యాయి. తొలి సెషన్‌ ముగిసే సరికి రూ.49 (10 %) లాభపడి రూ.536.35 వద్ద ముగిసింది.


2022, మే 11న డెల్హీవరీ ఐపీవోకు వచ్చింది. లిస్టింగ్ రోజే కంపెనీ ఆదాయం 1.68 శాతం పెరిగింది. లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్లో షేర్లకు పెద్దగా డిమాండ్‌ కనిపించలేదు. మే 23న జీఎంపీ కేవలం రూ.5గానే ఉంది. అందుకు తగ్గట్టే లిస్టింగ్‌ రోజు మెరుపులేం కనిపించలేదు. మే 13న ముగిసిన ఈ ఇష్యూకు 1.63 రెట్ల స్పందన లభించింది. 6,25,41,023 షేర్లు ఆఫర్‌ చేయగా 10,17,04,080 షేర్లకు బిడ్డు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కోటాలో 2.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు 57 శాతం సబ్‌స్క్రైబ్‌ చేశారు. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 30 శాతం దరఖాస్తు చేసుకున్నారు.


ఇప్పటి వరకు ఈ కంపెనీ లాభాలనే నమోదు చేయలేదు. ఏటా నష్టాలు మాత్రం తగ్గుతున్నాయి. 2021, డిసెంబర్‌ నాటికి రూ.891 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2021 ఆర్థిక ఏడాదిలో ఈ నష్టం రూ.415 కోట్లు కావడం గమనార్హం. గతంలోని రూ.3,838 కోట్లతో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.4,911 కోట్ల ఆదాయం ఆర్జించింది.


డెల్హీవరీలో కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు సహ వ్యవస్థాపకుల వాటాలను ఉపసంహరిస్తున్నారు. కార్లైల్‌ గ్రూపునకు చెందిన సీఏ స్విఫ్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.454 కోట్ల విలువైన షేర్లను డైల్యూట్‌ చేయనుంది. సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ డోర్‌బెల్‌ రూ.365 కోట్ల వాటాను విక్రయిస్తోంది. చైనా మూమెంటమ్‌ ఫండ్‌కు చెందిన డెలీ సీఎంఎఫ్‌ రూ.200 కోట్ల షేర్లను అమ్మేస్తోంది. టైమ్స్ ఇంటర్నెట్‌ రూ.165 కోట్ల షేర్లను విక్రయిస్తోంది.


కంపెనీ వ్యవస్థాపకులు కపిల్‌, భారతీ, మోహిత్‌ టాండన్‌, సూరజ్‌ సహరన్‌ వరుసగా రూ.5 కోట్లు, రూ.40 కోట్లు, రూ.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూలో 75 శాతం వరకు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. డెల్హీవరీ ఇష్యూకు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్స్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా లీడ్‌ మేనేజర్లుగా ఉన్నారు. డెల్హీవరీ దేశవ్యాప్తంగా 17,045 పోస్టల్‌ కోడ్స్‌లో సేవలు అందిస్తోంది.