YS Jagan Sensational Comments In Madanapalle Incident: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అనవసర నిందలు వేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అన్నారు. మదనపల్లె (Madanapalle) సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో రషీద్‌ దారుణ హత్యను ఖండిస్తూ.. తాను అక్కడికి వెళ్తుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మదనపల్లె ఘటనను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గనులు, లీజులు, మైనింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు క్లాస్ మేట్స్. కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబును కొట్టారంట. ఆయన ఎప్పుడూ తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు తీవ్ర కోపం. అందుకే వారి కుటుంబంపై పగబట్టారు. పెద్దిరెడ్డి ఏ పోర్ట్ ఫోలియా తీసుకున్నా దానిపై చంద్రబాబు ఆరోపణలు చేస్తారు.' అని జగన్ పేర్కొన్నారు.


'అప్పుడు ఎందుకు స్పందించలేదు.?'


మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే, డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన చంద్రబాబు.. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె మృతదేహం ఇంకా దొరక్కపోయినా స్పందించలేదని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీని బదిలీ చేశారని.. ఒక అనుమానితుడు లాకప్ డెత్‌కు గురయ్యాడని అన్నారు. 'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌, మహిళలకు ఓ వరంలా ఉండేది. ఆపదలో ఉన్న మహిళలు.. యాప్‌ను వినియోగించినా, ఫోన్‌ను 5 సార్లు ఊపినా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే వారు. ఇప్పుడు అవేవీ పని చేయడం లేదు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి.' అని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో దారుణాలు జరిగాయని.. తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని తెచ్చుకుంటే ఇష్టానుసారంగా వ్యవహరించారని.. ఎన్నికల సంఘమే స్పందించి ఆయన్ను బదిలీ చేసినట్లు చెప్పారు.


'ఏం సందేశం ఇవ్వదల్చారు.?'


వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హతమార్చారని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. 'పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేశారు. మాజీ ఎంపీ వాహనం ధ్వంసమైంది. సీఎం కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఏకంగా రెడ్ బుక్ ప్రదర్శిస్తూ బెదిరిస్తున్నారు. ఇలా ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు.?. ఈ రోజు ఏపీ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలన. దీనిపై ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైంది.' అంటూ జగన్ వ్యాఖ్యానించారు.


Also Read: YS Jagan: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం