ABP Desam Health Conclave 2024 Live: ABP హెల్త్ కాన్‌క్లేవ్‌ 2024 సదస్సులో తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. ఏ దేశానికి వెళ్లినా మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మందులు వాడుతున్నారని తెలిపారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ విషయంలో ముందంజలో ఉండాలని అన్నారు. పలు ఆరోగ్య సమస్యలపై పరిశోధన జరగాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ABP దేశం న్యూ ప్లాట్‌ఫామ్‌ని అభినందించారు. 30-35% మందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.




గిరిజన ప్రాంతాల్లో వైద్యులు ప్రాక్టీస్ చేస్తే అక్కడా ఆరోగ్య పరంగా అభివృద్ధి చెందుతామని వివరించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన విద్యార్థులు మంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగారు. రీసెర్చ్‌లో ఎందుకు వెనకబడుతున్నామని ఓ విద్యార్థి అడగ్గా అందుకు మంత్రి బదులిచ్చారు. ఇప్పుడిప్పుడే పరిశోధనలపై అవగాహన పెరుగుతోందని వెల్లడించారు. విద్యార్థులంతా రీసెర్చ్‌కీ సమయం కేటాయించాలని సూచించారు. మెడికల్ కాలేజీలను పరిశోధనలకు వేదికలుగా మార్చుకోవాలని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు పొన్నం ప్రభాకర్. యువ వైద్యులు స్వచ్ఛందంగా ఏజెన్సీ ఏరియాలకు వెళ్లి పని చేయాలని సూచించారు. ఈ సామాజిక స్పృహ అందరిలోనూ కలగాలని కోరారు. 


ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు , హైదరాబాద్ హెల్త్ హబ్ ,తదితర అంశాల పై కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహారం కన్నా మందులే ఎక్కువగా తీసుకుంటున్నామని అన్నారు. వికారాబాద్‌లో నిజాం కాలంలో ఔషధ మొక్కలు నాటారని, ఆ గాలితోనే చాలా మటుకు రోగాలు తగ్గిపోయేవని గుర్తు చేశారు. ఎక్కువ డోస్‌లు తీసుకోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 
30-40 సంవత్సరాల లోపు వారికి కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తున్నాయని చెప్పారు. డయాలసిస్ కేసులు అధికమవుతున్నాయని వెల్లడించారు. గతంలో కరోనా సహా మరెన్నో వైరస్‌లు వ్యాప్తి చెందాయన్న పొన్నం ప్రభాకర్ వీటిపై ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరముందని చెప్పారు. హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు కూడా మెడికల్ హబ్‌గా ఉందని అన్నారు. మెడికల్ టూరిజం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ లో కడుతున్న 4 హాస్పిటల్స్‌పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ చేశారని వివరించారు.