Andhra Pradesh: ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి వైసీపీ శ్రేణులను జగన్ సిద్దం చేశారు. కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ గతంలో ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని కోసం జగన్ ఉండి ఉంటే అనే నినాదాన్ని తీసుకొచ్చారు. 


పథకాల అమలు ఎప్పుడు


శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగన.. తమ హయాంలో చేసిన పథకాలను వివరించారు. హామీలను అమలు చేసే ఉద్దేశం లేకపోవడంతోనే శ్వేతపత్రం అని ఆర్థిక విధ్వంసం అంటూ కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు జగన్. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుందని ఇప్పటి వరకు పథకాలకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడం లేదన్నారు. 


Also Read: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం


జగన్ పథకాలు గుర్తు చేసే వ్యూహం


పథకాలు అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే అనే నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు అధికారంలో జగన్ ఉండి ఉంటే చాలా పథకాలు ప్రజలకు అందేవని బలంగా తీసుకెళ్లనున్నారు. ఇదే విషయం ప్రెస్‌మీట్లో జగన్‌ వివరించారు. 


తల్లికి వందనం ఎప్పుడు


రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి వచ్చేదని ప్రజలు అనుకుంటున్నారని జగన్‌ అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి డబ్బులు వస్తయని లెక్కలు వేసి మరీ చెప్పారని అన్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే జూన్‌లో విద్యార్థుల తల్లలు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి అన్నారు.


Also Read: హామీలు అమలు చేయాల్సి వస్తుందనే బడ్జెట్‌ పెట్టడం లేదు- చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు


ఇప్పుడు డేటా అంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. డేటా ఏముందని ప్రతి ఊరిలో సచివాలయం ఉందని వారి వద్ద మొత్తం డేటా ఉంటుందని అడిగిన క్షణాల్లో వారు ఇచ్చేస్తారని చెప్పారు. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.  తల్లికి వందనం కోసం 43 లక్షల మంది తల్లులు, 82లక్షల మంది పిల్లలు ఎదురుచూస్తున్నారని లెక్కలు చెప్పారు. 


 


సీఎంగా జగన్ ఉండి ఉంటే...


సీఎంగా జగన్ ఉండి ఉంటే... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేదని తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఉందన్నారు జగన్. ఇప్పటి వరకు విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోగా కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జగన్‌ సీఎంగా ఉండి ఉంటే విద్యాదీవెన కింద ఫీజు, ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులకు డబ్బులు వచ్చేవని అన్నారు. 


వైసీపీ అధికారంలో ఉండి ఉంటే... మహిళలకు సున్నా వడ్డీ రుణాలు వచ్చేవన్నారు జగన్. రైతులకు రైతుభరోసా వచ్చేదని అన్నారు. రైతులకు 20వేలు ఇస్తామన్న చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రైతు బీమా కూడా వచ్చేదని చెప్పుకొచ్చారు. అసలు ఇప్పటి వరకు రైతుల బీమా ప్రీమియం కట్టలేదని ఆరోపించారు. తాము అధికారంలో ఉండి ఉంటే కచ్చితంగా అది కూడా జరిగేదన్నారు. 


ఇలా అన్నింటినీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. పథకాలపై ప్రజల్లో చర్చ మొదలయ్యేలా చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌పై ప్రజలు ప్రశ్నించేలా చేస్తున్నారు.