YSRCP Jagan: ఆంధ్రప్రదేశ్‌లో భయానక వాతావరణం ఉందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. బడ్జెట్‌ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందో అని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని అన్నారు. అందులో మీడియాను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 


రాష్ట్రం ఎటు పోతోంది


రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో అందరూ ఆలోచించాలని మాజీ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. గత 52 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఆస్తులు ధ్వంసం చూస్తుంటే పురోగతి వైపు వెళ్తుందా?.. రివర్స్‌లో వెళ్తోందా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. ప్రశ్నించే వాళ్లు లేకుండా ఉండేలా పాలన సాగుతోందని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. 


పూర్తి బడ్జెట్ ఎప్పుడు 


హామీలపై ప్రజలు నిలదీస్తారని భావించే బడ్జెట్‌ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు జగన్. పూర్థిస్థాయి బడ్జెట్‌ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని... మోసపూరిత హామీలకు కేటాయింపులను ప్రశ్నిస్తారని భయపడుతున్నారని అన్నారు.  


Also Read: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం


ఏపీలో అప్పులు ఐదు లక్షల కోట్లే


14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయిని ఇప్పటి వరకు ప్రచారం చేసిన చంద్రబాబు గవర్నర్‌ ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పులు చూపించారని జగన్‌ వివరించారు. ఇప్పుడు శ్వేత పత్రాలతో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఏపీ తీసుకున్న అప్పులు రూ.5 లక్షల 18 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. 


2014 నుంచి ఐదేళ్ల వరకు చంద్రబాబు హయాంలో 21.63 శాతం వడ్డీతో  అప్పులు చేశారని జగన్ వివరించారు. వైసీపీ హయాంలో కేవలం 12.63 శాతం మాత్రమే అప్పులు చేశామన్నారు. తమ హయాంలో జరిగిన ఆర్థిక విధానాలను  కేంద్ర ఎకనామిక్‌ సర్వే ప్రశంసించిందన్నారు. 


Also Read: "జగన్‌ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత


అన్నింటితో కలుపుకుంటే ఏడున్నర కోట్లే


2 లక్షల 72 వేల కోట్ల అప్పుతో 2019లో చంద్రబాబు తమకు ప్రభుత్వాన్ని అప్పగించారని తెలిపారు జగన్. ఇప్పుడు అది ఐదు లక్షల 18 వేల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. మిగతా అప్పులు అంటే గ్యారంటీలు, విద్యుత్ ఒప్పందాలు, కలిపినా ఏడున్న లక్షల వరకు ఉంటుందని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లకు చేరిందని ప్రచారం చేశారని... గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్దాలు చెప్పించారన్నారు.  


ప్రజలకు దాదాపు మూడు కోట్లు ఇచ్చాం  


వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో కేవలం వందల కోట్లు మాత్రమే ఉందని గుర్తు చేశారు. మధ్యలో కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. డీబీటీ ద్వారా రూ.2.71 లక్షల కోట్లు ప్రజలకు చేరవేశామని తెలిపారు.  



లెక్కచూసిన తర్వాత ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేశారో అర్థం చేసుకోవాలన్నారు. వీటిని సభలో చెప్పాల్సి ఉంటుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టడం లేదన్నారు. గవర్నర్‌ కూడా ఆర్థిక శాఖను పిలిచి మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా రాస్తామన్నారు జగన్