Jagan: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది కేంద్రం. లోక్‌సభలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... రెండేళ్లలో అంటే 2026 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేసింది. 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవల్ వరకు నీటిని నిల్వ చేసుకునేలా పనులు పూర్తి అవుతాయని తేల్చి చెప్పింది.
పోలవరానికి నాలుగు ఆటంకాలు
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి నాలుగు అంశాలు ప్రధాన కారణమని పేర్కొన్న కేంద్రం జగన్‌ను ఇరికిచింది. పోలవరం ఆలస్యానికి చెప్పిన ప్రధాన కారణాల్లో కాంట్రాక్టర్ మార్పును చెప్పింది. తర్వాత పునరావాసం, భూసేకరణ వేగంగా జరగకపోవడం కూడా మరో రీజన్‌గా చెప్పింది. కరోనా కూడా మరో కారణంగా చెప్పుకొచ్చింది. ఇవి ప్రభుత్వమో, అధికారులో ఇచ్చినవి కావని ఐఐటీ హైదరాబాద్ స్టడీ చేసి 2021లో ఇచ్చిన నివేదిక ఆధారంగా చెబుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
8వేల కోట్లు విడుదల
ఆ నివేదికను వివరించిన కేంద్ర జల్ శాఖ మంత్రి సీఆర్‌పాటిల్ కేంద్ర చేసిన ఖర్చులు కూడా తెలిపారు. 2014 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని వందశాతం ఇస్తున్న కేంద్రం గత మూడేళ్ల కాలంలో రూ.8,044.31 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
కొత్త డయాఫ్రమ్ వాల్
మరోవైపు ఏపీలో కేబినెట్ గురువారం సమావేశమై పోలవరంపై విస్తృతంగా చర్చించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైందని దీనికి సమాంతరంగా మరో కొత్త వాల్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 990 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ కేబినెట్ అభ్యర్థించింది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వెంటనే 12వేల 157.53 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తూ తీర్మానం చేశారు.
ఐదేళ్లపాటు పోలవరం అతీగతీ లేకుండా చేశారని వాటిని సరిచేస్తూ త్వరితగతిన ప్రాజెక్టు పూర్తిచేయాలంటే కచ్చితంగా కేంద్ర సాయం అవసరమని కేబినెట్ తీర్మానించింది. 2019 వరకు పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా పనులు సాగాయని వివరించారు. దాదాపు 72 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం మొదలైందని తెలిపారు. కాఫర్ డ్యాంలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొంది. 2019, 2020లో అసలు పనులే చేయలేదని ఫలితంగానే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని వివరించారు.
నిపుణుల సూచనల మేరకు కచ్చితంగా ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయడం కంటే సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. దీనికి 990 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. అదే విధంగా సవరించిన తొలి దశ అంచనాలలో ఇంకా 12,157.53 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. అడ్వాన్స్‌గా చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపారు. మరోవైపు రెండోదశకు సంబంధించిన అంచనాలను కూడా సవరించాలని కోరింది. ప్రాజెక్టు నిర్మాణంపై స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పరిస్థితి లేకుండా చూడాలని శాశ్వతంగా పరిష్కరించాలని కోరింది కేబినెట్.
Also Read: ఏపీలో భూమిపత్రాలపై చంద్రబాబు బొమ్మలంటూ ప్రచారం - ఇదిగో అసలు నిజం