Good News to Dwcra Women: అనంతపురం: ఏపీలో డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) శుభవార్త అందించారు. వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి.. కంప్యూటర్ బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల నగదు జమ చేయనున్నారు.
ప్రభుత్వం ఇదివరకే వైఎస్సార్ ఆసరా కింద మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు డ్వాక్రా మహిళలకు అందించింది. నాలుగో విడత కిందట రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల జాబితాపై ఏమైనా సందేహాలు ఉన్నవారు హెల్ప్‌లైన్ నంబర్ 0863-2347302 కు కాల్ చేయవచ్చు. లేకపోతే ఇమెయిల్ ఐడీ supportmepma@apmepma.gov.in ద్వారా సంప్రదించాలని సూచించారు.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా...
- ఏపీ సీఎం వైఎస్ జగన్ జనవరి 23వ తేదీన ఉదయం 9 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 9.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు
- పుట్టపర్తి ఎయిర్ పోర్టు నుంచి జగన్ హెలికాప్టర్‌లో బయల్దేరి 10.30 గంటలకు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు
- అనంతరం 10.30 నుంచి 10.40 గంటల వరకు ప్రజాప్రతిధులతో సీఎం జగన్ మాట్లాడతారు. అక్కడి నుంచి బహిరంగ సభావేదిక వద్దకు వెళ్తారు
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా సంఘాల) మహిళలతో సీఎం జగన్ మాట్లాడి వారి వివరాలు తెలుసుకుంటారు.
- అనంతరం కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. తరువాత వైఎస్సార్ ఆసరా (YSR Asara) నాలుగో విడత కింద డ్వాక్రా సంఘాల ఖాతాల్లో ఆయన నగదు జమ చేస్తారు
- కార్యక్రమం పూర్తయ్యాక జగన్ స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నేతలతో చర్చిస్తారు
- మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30కు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరతారు. అటు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.
సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం..
సీఎం వైఎస్ జగన్ ఉరవకొండ పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. ఇదివరకే సత్యసాయి ఎయిర్ పోర్ట్ పరిసరాలనుఆయన పరిశీలించారు. సీఎం జగన్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని... ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ వెళ్తారన్నారని చెప్పారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుని ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వెళతారని చెప్పారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పనిచేయాలని సిబ్బంది, అధికారులను ఆదేశించారు.
Also Read: AP Voter List: ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల, మీ డీటైల్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేస్కోండి