Andhra Pradesh News: మరో మూడు నెలలలోపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఉన్నందున రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఉంచింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం దీన్ని విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఫైళ్ళను కూడా ఈసీ అప్‌లోడ్ చేసింది.


గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై పెద్ద ఎత్తున ఈసీకి కంప్లైంట్లు వెల్లువెత్తాయి. దీంతో దొంగఓట్లను తీయించే ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. అనంతరం తుది ఓటర్‌ జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. తాజాగా తుది జాబితా కూడా విడుదల అవడంతో ఇందులో కూడా తప్పులు ఉన్నట్లు తేలితే అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. 


తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను డౌన్ లోడ్ చేసి నకిలీ కార్డులు సృష్టించడంపై కూడా ఈసీ సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి అడిషనల్ కలెక్టర్ గిరీషతో పాటుగా, మరికొంత మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుది ఓటర్ జాబితాలో తప్పులు వస్తే తమపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని జాబితా రూపకల్పనలో ఉన్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.