YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు మరో కారణాన్ని అనుమానితులు కోర్టులో వెలిబుచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ కొత్త వాదనను హైకోర్టు ముందు ఉంచారు. వైఎస్ వివేకా హత్యకు కారణం లైంగిక వేధింపులేనన్నారు. సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకా లైంగికంగా వేధించారని అందుకే దారుణంగా హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండో భార్య కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో విబేధాలు ఉన్నాయన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు. వివేక హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేశారని, హత్యచేసిన తీవ్ర అభియోగాలు ఉన్నాయని, అరెస్టు చేయకుండానే ముందస్తు బెయిల్‌కు సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడం చట్ట వ్యతిరేకమని సోమవారం జరిగిన వాదనల్లో నిందితుల తరపు లాయర్లు వాదించారు. ఈ కేసులో భాసర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యేందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య అంశం మొదట రాజకీయ వివాదం అయింది. గుండెపోటు అని మొదట ప్రచారం జరిగినప్పటికీ తర్వాత దారుణమైన హత్యగా తేలింది. ఆ తర్వాత చంద్రబాబు, ఆదినారాయణరెడ్డిలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తులోఏదీ తేలకపోవడంతో సీబీఐ విచారణ కోసం వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో సీబీఐ విచారణ జరుపుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల గురించి ప్రధానంగా సాక్ష్యాలు లభించినట్లుగా సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడైన శివశంకర్ రెడ్డి భార్య సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దర్యాప్తు అధికారిని మార్చారు. ఈ మధ్యలో అసలు నిందితులు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డేనని ఆరోపిస్తూ... నిందితులు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా సునీల్ యాదవ్ తన తల్లిపై లైంగిక వేధింపులు పాల్పడినందుకే హత్య చేశారన్న కొత్త విషయాన్ని కోర్టులో చెప్పడం.. సంచలనంగా మారింది.