Balineni Srinivasa Reddy: పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని అసలు నేను ఏ మీడియాతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది నా ఆశ అని .. అందు కోసమే ప్రయత్నిస్తున్నానన్నారు. నా ఒంగోలు నియోజకవర్గ పేదల పట్టాల కోసం ప్రయత్నం చేసుకున్నానన్నారు. తాను సీఎం వైఎస్ జగన్ పిలిస్తే వెళ్లనన్నానని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు.
మాగుంట అయితే అన్ని నియోజకవర్గాల్లో ప్లస్ అవుతుందనే అడిగా !
మాగుంట విషయంపైనా బాలినేని స్పందించారు. ఎంపీ సీటు విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం ప్రయత్నం చేశా.. మిగతా నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనట్లున్నారు.. అధిష్టానం దృష్టిలో నేను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోంది.. నేను అందరి శ్రేయస్సు కోసం అడుగుతున్నా.. మిగతావాళ్లకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు..? అని ప్రశ్నించారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఏ ఎంపీ అభ్యర్ధి వచ్చినా నాకు ఏ అభ్యంతరం లేదు.. నా పని నేను చేసుకుంటానని తెలిపారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వంపై రాజీ పడిపోయిన బాలినేని
తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే చెవిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు బాలినేని సిద్ధంగా లేరు. ఈ అంశంపై మాట్లాడేందుకు సోమవారం బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. కానీ కారు దిగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. చెవిరెడ్డికే ఎంపీ టిక్కెట్ ఖరారు చేసినట్లగా తెలియడంతో.. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్లుగా ప్రచారం జరిగిదంి. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్ గా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. ఆ తర్వాత బాలినేనితో సజ్జల రెండు గంటల పాటు చర్చించారు.
సీఎం జగన్ బంధువు బాలినేని - వైసీపీని వీడరంటున్న అనుచరులు
బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు దగ్గర బంధువు. గతంలో ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. తర్వాత పలు సందర్భాల్లో వైసీపీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన పార్టీ మారే అవకాశం ఉండడని.. వైసీపీ తరపునే పోటీ చేస్తారని అంటున్నారు. మరో వైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి .. తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బాలినేని మాత్రం ఒంగోలు నుంచి వైసీపీ తరపునే పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.