Bhamakalapam 2: సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’. 2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది.


ఆకట్టుకుంటున్న‘భామా కలాపం 2’ టీజర్


తాజాగా ‘భామా కలాపం 2’ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “అను మనం వదిలి వెళ్తున్నది మన పాత ఇంటినే కాదు, నువ్ చేసిన తప్పుల్ని. ఇవేవి కూడా మళ్లీ నా లైఫ్ లోకి తీసుకురానని మాటివ్వు” అనే డైలాగ్ తో ఈ టీజర్ షురూ అవుతుంది. “అనుపమ అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని, నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను” అంటూ ప్రియమణి చెప్తుంది. అయినప్పటికీ, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ప్రియమణి మళ్లీ ఓ హత్య వ్యవహారంలో ఇరుక్కుంటుంది. అందులో నుంచి ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ‘భామా కలాపం 2’ చూడాల్సిందే! ఈ సినిమా కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.


‘భామా కలాపం 2’ విడుదల ఎప్పుడంటే?


ఇక ‘భామా కలాపం 2’ సినిమా విడుదలకు సంబంధించి అప్ డేట్ కూడా రివీల్ చేసింది ‘ఆహా’ ఓటీటీ సంస్థ. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న తమ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు  ప్రకటించింది. ‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.


కరోనా సమయంలో విడుదలైన ‘భామా కలాపం’


అటు ప్రియమణి నటించిన ‘భామ కలాపం’ సినిమా కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాను అభిమన్యు తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇందులో ప్రియమణి అనుపమ మోహన్ అనే యూట్యూబర్ గా నటించింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఆమెకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వింత అలవాటు ఆమెను ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. దాని నుంచి ఆమె బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగుతూ ఆకట్టుకుంది. ఈ సినిమా ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సత్తా చాటింది.


Read Also: ‘సరిపోదా శనివారం’ రైట్స్ ఆ ఓటీటీకే, రికార్డు ధరకు కొనుగోలు!