Bigg Boss Telugu OTT 2: ముందుగా హిందీ భాషలో ప్రారంభమయిన బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తర్వాత ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యింది. అందుకే సౌత్ భాషల్లో కూడా దీనిని ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. దాంతో పాటు అదనంగా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. తాజాగా టీవీలో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. కానీ ఈ సీజన్‌కు ఎన్నో కష్టాలు ఎదురయ్యేసరికి అసలు ఓటీటీ రెండో సీజన్ ఉంటుందా లేదా అని డౌట్లు మొదలయ్యాయి.
ఫిబ్రవరీ మొదటి వారంలో..
టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్‌ఫుల్ కావడంతో ఓటీటీలో కూడా మొదలయ్యింది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యింది. ఈ రియాలిటీ షోను రెగ్యులర్‌గా చూసేవారు, దీని కాన్సెప్ట్‌ను ఇష్టపడేవారు తప్పా పెద్దగా ప్రేక్షకులు ఎవరూ బిగ్ బాస్ తెలుగు ఓటీటీని పట్టించుకోలేదు. అయినా కూడా బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవ్వడంతో ఓటీటీలో 2వ సీజన్ ప్రారంభిస్తే.. చాలామంది చూస్తారని మేకర్స్ భావించారు. అందుకే ఫిబ్రవరీ మొదటి వారంలోపు కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేసి సీజన్‌ను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంతలోనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 2వ సీజన్ పలు సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.
ఆ ముగ్గురు రెడీ..
మామూలుగా బిగ్ బాస్ ఓటీటీలో పూర్తిగా కొత్త కంటెస్టెంట్స్ ఉంటారని గ్యారెంటీ లేదు. ఇందులో కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా మళ్లీ బిగ్ బాస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ముందుకొస్తారు. బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కూడా అఖిల్, యాంకర్ శివ, తేజస్వి లాంటివారు మళ్లీ కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన నయని పావని, భోలే షావలి, ప్రిన్స్ యావర్.. ఓటీటీలో కూడా పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కానీ వీరు తప్పా ఇంక ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ ఇందులో పాల్గొనడానికి కనీసం ఆసక్తి చూపించడం లేదట. బిగ్ బాస్ 7 పూర్తయిన తర్వాత మరోసారి ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చి.. మళ్లీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదంటూ పలువురు కంటెస్టెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
గొడవ ఎఫెక్ట్..
బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు జరిగిన గొడవ కూడా కంటెస్టెంట్స్ నిర్ణయానికి కారణం కావచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇది ఒక రియాలిటీ షో అని, ఇందులో ఎవరో ఒక్కరే విన్నర్ అవుతారు అని కనీసం జ్ఞానం లేకుండా కొంతమంది అభిమానులు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. కంటెస్టెంట్స్ కార్ల వెంట పరిగెడుతూ వారిని బూతులు తిట్టారు. ఇదంతా చూసిన తర్వాత వారికి బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనాలనే ఆలోచన అస్సలు లేదని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఓటీటీ సీజన్‌ను క్యాన్సల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక హోస్ట్‌గా వ్యవహరించాల్సిన నాగార్జున సైతం తన సినిమాలతో బిజీగా ఉండడంతో ఓటీటీ సీజన్‌ను క్యాన్సల్ చేయడమే మేలు అని భావిస్తున్నారట. మరి, ఇది ఎంత వరకు నిజమనేది నిర్వాహకులే చెప్పాలి. ప్రస్తుతం దీనిపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
Also Read: ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి - నిజమెంత?