Budget Presentation Process : చిన్న ఇంటిని నడిపించాలంటేనే సవాలక్ష లెక్కలు...నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చే జీతం, కట్టాల్సిన ఈఎంఐలు, చెల్లించాల్సిన బాకీలు, ఇంటి ఖర్చులు వీటన్నింటికీ జాగ్రత్తలు లెక్కలు వేసుకుని మరీ రూపాయి రూపాయి ఖర్చు చేసినా... చివరికి ఎంతో కొంత మిగులో తగులో తేలుతుంది. మనం వేసుకున్న అంచనాలు దాటిపోవడమో...అనుకోని అవసరాలు ఎదురవ్వడమో జరుగుతుంది. 


బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంలో నూతన ఒరవడి


అదే బడ్జెట్‌ దేశం మొత్తానికి సంబంధించిన రూపకల్పన అంటే ఎంత కసరత్తు చేయాలో ఒకసారి ఆలోచించండి. అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రణాళికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి అన్ని అవసరాలు తీరేలా..అందరినీ మెప్పించేలా బడ్జెట్ రూపొందించడమంటే మాటలు కాదు.  అలాంటి బడ్జెట్‌ రూపకల్పనలోనే కాదు ప్రవేశ  పెట్టే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉన్నా...కాలక్రమంలో ప్రవేశపెట్టే విధానం మాత్రం మారిపోయింది.


లెదర్ సూట్ కేసు-బాహీ ఖాతా


గతంలో బడ్జెట్‌ కాపీలను ఆర్థిక మంత్రులు‍(Finance Minister) లెదర్ సూట్ కేసుల్లో పెట్టుకుని పార్లమెంట్‌కు తీసుకొచ్చి చదివి వినిపించేవారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపుగా ఇదే విధానం అవలంభిస్తూ వస్తున్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Seetharaman) కొత్త సంప్రదాయానికి తెరలేపారు. బ్రీఫ్‌కేస్‌కు బదులుగా బాహీ ఖాతా అని పిలిచే ఎర్రని వస్త్రం లాంటి సంచిలో బడ్జెట్‌ పత్రాలను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. బ్రిటీష్ ఆర్థిక మంత్రుల నుంచి వచ్చిన బ్రీఫ్‌కేస్‌ సంప్రదాయానికి ఆమె స్వస్తి పలికారు. 2019 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్ లెదర్‌ సూట్‌కేసు( Breaf Case)కు బదులుగా ఎరుపు రంగు బహీ ఖాతాతో కనిపించి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. బహీఖాతాను గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు, తమ ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. భారతీయ సంప్రదాయానికి విలువిస్తూ అప్పటి నుంచి ఆమె ఆ విధానాన్ని ప్రారంభించారు.


లెదర్ సూట్ కేసు-బాహీ ఖాతా-టాబ్లెట్‌


కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారపోయాయి. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి ఆధునికత వైపు ప్రపంచం అడుగులు వేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే బడ్జెట్ ప్రవేశపెట్టే విధానమూ మారిపోయింది. 2021లో నిర్మలా సీతారామన్ ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశీయంగా తయారు చేసిన టాబ్లెట్‌ను ఉపయోగించి పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్‌ సమర్పించారు. 2021, 2022, 2023లో ఆమె బహీ ఖాతా శైలిని గుర్తుకు తెచ్చే ఎరుపు రంగు పర్సులో టాబ్లెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తిని చాటేందుకు నిర్మల ఈ నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. మునుపటి మూడు పూర్తి యూనియన్ బడ్జెట్ల మాదిరిగానే, మధ్యంతర యూనియన్ బడ్జెట్ 2024 కూడా పేపర్‌లెస్ రూపంలో ప్రవేశపెట్టనున్నారు.


ఇప్పటికీ రికార్డు మురార్జీ దేశాయ్‌దే 


స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ను అప్పటి ఆర్థికమంత్రిఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ఆయన బ్రిటీశ్ ఆర్థికమంత్రులు అనుసరించినట్లే బ్రీఫ్ కేసులో ప్రతులు పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు అత్యధికంగా 10సార్లు మొరార్జీ దేశాయ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.... పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్‌ సిన్హా  8 సార్లు, మన్మోహన్‌ సింగ్‌ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. తాజాగా నిర్మలా సీతారామన్‌ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.