Budget 2024 Expectations: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, అందరి జీవితాల మీద బడ్జెట్‌ ప్రభావం ప్రత్యక్షంగా పడుతుంది. అందుకే, బడ్జెట్‌ టైమ్‌ దగ్గర పడేకొద్దీ జనం అలెర్ట్‌ అవుతుంటారు. ఎలాంటి వరాలు/వాతలు ఉంటాయో ఏటా అంచనాలు వేస్తుంటారు. ముఖ్యంగా, దేశ ప్రజల్లో ‍‌మెజారిటీ వర్గమైన మధ్య తరగతి జీవులు (Middle class people), ఠంచనుగా టాక్స్‌ కట్టే వేతన జీవులు (Taxpayers) ఎక్కువగా ఎక్సైట్‌ అవుతుంటారు.


ఇది మధ్యంతర బడ్జెట్‌ (Interim budget 2024) అయినా, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించే పద్దు కాబట్టి.. కొన్నయినా తాయిలాలు ఇస్తారన్న ఆశలు కామన్‌మ్యాన్‌ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. కొన్ని విషయాలపై ఆశలు పెంచుకోకపోవడమే ఉత్తమం అని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ సలహా ఇస్తున్నారు. 


ఆశలు పెంచుకోవద్దని నిపుణులు చెబుతున్న అంశాలవి:


పన్ను మినహాయింపులు ‍‌(Tax exemptions): వేతన జీవులు ఆశించే పన్ను మినహాయిపుల వంటి తాయిలాలు పూర్తి స్థాయి బడ్జెట్‌లో మాత్రమే ఉంటాయని చరిత్ర చెబుతోంది. అంటే, ఆదాయ పన్నుకు సంబంధించి టాక్స్‌పేయర్లు ఏం వరాలు కోరుకోవాలన్నా.. కొత్త ప్రభుత్వాన్ని అడగాల్సిందే, ఈ ఏడాది జూన్‌/జులై వరకు వరకు ఎదురు చూడాల్సిందే.


విధాన నిర్ణయాలు (Policy decisions): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వస్తున్న ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ (Vote-on-Account Budget 2024) ఇది. ఒకవేళ ప్రభుత్వం మారితే, మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందన్న భరోసా లేదు. అందుకే, కొత్త పథకాలు, నూతన విధాన నిర్ణయాల జోలికి పోకుండా.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమయ్యే వ్యయాల కోసమే బడ్జెట్‌ పెట్టాలని మోదీ 2.0 ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్‌ మీద అంచనాలు పెట్టుకోవద్దని, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కూడా గతంలోనే స్పష్టంగా చెప్పారు.


సంక్షేమ పథకాలు (Welfare schemes): కొన్ని నెలలుగా ఎన్నికల వ్యూహాల్లో తలమునకలవుతున్న కేంద్ర ప్రభుత్వం, కొత్త సంక్షేమ పథకాల రూపకల్పన జోలికి వెళ్లలేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక కొత్త పథకానికి ప్రాణం పోయాలంటే.. ఆలోచన నుంచి అమలు చేశాక వచ్చే అవాంతరాల వరకు చాలా విషయాలను ముందుగానే ఊహించి, తదనుగుణంగా సన్నద్ధమవ్వాలి. దీనికి చాలా నెలల పరిశోధన, డబ్బు అవసరం. హ్యాట్రిక్‌ మీద దృష్టి పెట్టిన మోదీ సర్కార్‌, కొత్త పథకాల కోసం ఇంత సమయాన్ని వెచ్చించే పరిస్థితిలో లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి, పూర్తి స్థాయి బడ్జెట్‌ వచ్చే వరకు, కొత్త పథకాల ఊసును పక్కనబెట్టాల్సిందే.


ఆర్థిక విధానాలు (Economic policies): సాధారణంగా, ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌లో నూతన ఆర్థిక విధానాలను ప్రకటించరు. ఎందుకంటే, కొత్త ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మారుస్తాయి. సానుకూలంగానో/ప్రతికూలంగానో.. కొత్త విధానాల తక్షణ ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై ఉంటుంది. ఎన్నికల ముందు ఇది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి, కొత్త ఆర్థిక విధానాలను కూడా ఈ బడ్జెట్‌లో ఆశించకూడదు.


ద్రవ్య లోటు (Fiscal deficit): భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అతి పెద్ద విషయం ఇదే. ద్రవ్య లోటును పూడ్చేందుకు.. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులను నిరుత్సాహపరచడం, వ్యయాలను తగ్గించుకోవడం వంటివి చేయాలి. ఈ సూత్రాలను స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే దీర్ఘకాలంలో ఆర్థిక పరిస్థితి బాగుపడినా... స్వల్పకాలంలో కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల మూడ్‌లో ఉన్న మోదీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉందా అన్నది అనుమానమే.


మరో ఆసక్తికర కథనం: రెండు వారాల గరిష్టంలో గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే