Pulasa Fish : పుస్తెలమ్మైనా పులస చేప తినాల్సిందే అని గోదావరి జిల్లాల్లో నానుడి. జీవితంలో ఒక్కసారైనా పులస పులుసు తినాలంటారు గోదావరి వాసులు. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ చేపకు చాలా డిమాండ్ ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ చేపలు నదీ జలాల్లో సంతానోత్పత్తికి వస్తుంటాయి. జులై, ఆగస్టుల్లో గోదావరి వరద బంగాళాఖాతంలో కలిసే నదీ ముఖద్వారం వద్దకు పులస చేపలు వస్తాయి. గోదావరిలో ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. 


రూ. 23 వేలు పలికిన పులస 


గోదావరి జిల్లాల్లో పులస చేపకు మామూలు క్రేజ్ ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే జాలర్లు, భోజన ప్రియులు పులస కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పులస చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి ఈ చేపలకు మార్కెట్ లో  భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే పులస దొరకగానే వాటిని సొంతం చేసుకునేందుకు భోజన ప్రియులు బారులు తీరుతారు. యానాం మార్కెట్లో ఇటీవల రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది. తాజాగా మరో పులస జాలర్లకు చిక్కింది. దీని ధర మరింత ఎక్కు పలికింది. రెండు కిలోల బరువున్న పులస చేప ఆగస్టు 28 న యానాం రాజీవ్‌ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద అమ్మకానికి పెట్టారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేప గోదావరిలో వరద నీటికి ఎదురీదుతుంది.  


సంతానోత్పత్తికి గోదావరిలోకి 


పులసలు నదీ సంగమాల వద్ద గోదావరిలో ప్రవేశించి ధవళేశ్వరం బ్యారేజ్  వరకు వెళ్తాయి. నదిలో మున్ముందుకు వెళ్లేకొద్దీ వాటి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యే జరుగుతుందండి. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి.  గోదావరి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోందని చెబుతారు. ఈ చేపలో కొవ్వు సముద్రంలో ఉన్నప్పుడు 12.4 శాతం వరకూ ఉంటే నదీ ముఖద్వారం వద్దకు వచ్చినప్పుడు 17.3 శాతానికి పెంచుకొని సంతానోత్పత్తికి సిద్ధమవుతుందట. గోదావరిలో ఎదురీదే సమయంలో ఆహారం తీసుకోకుండా తన శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని వెళ్తుంది. అలా ముందుకొచ్చేకొద్దీ ఈ చేపలోని కొవ్వు తగ్గిపోతూ వస్తుంది. ఎంతలా అంటే 14.50 నుంచి 8.78 శాతం వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. 


రుచి అందుకేనండి 


గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. ప్రతి సీజన్లో పులస చేపల వ్యాపారం లక్షల్లో జరుగుతుంది.


Also Read : Jagananna Videshi Vidya Deevena : విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్- టోఫెల్, జీఆర్ఈ పరీక్షలకు ఉచిత శిక్షణ!