IT stocks down: యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ ‍(US Federal Reserve‌) ఛైర్మన్ జెరోమ్ పావెల్ గత శుక్రవారం చేసిన హాకిష్ కామెంటరీతో ఇవాళ్టి (సోమవారం) ట్రేడింగ్‌లో మార్కెట్‌లో రక్తపాతం కనిపించింది. సెన్సెక్స్‌ 1466 లేదా 2.49 శాతం నష్టంతో 57,367.47 దగ్గర ప్రారంభమైంది. నిఫ్టీది కూడా ఇదే బాట. ఇది 370 లేదా 2.11 శాతం నష్టంతో 17,188.65 దగ్గర ఓపెన్‌ అయింది. నిఫ్టీ బ్యాంక్‌ 775 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 38111.60 దగ్గర ప్రారంభమైంది. అయితే, మధ్యాహ్నం 1.30 గం. సమయానికి ఇవి నష్టాలు తగ్గించుకుంటూ వచ్చాయి.


సెక్టోరియల్‌గా చూస్తే... అన్నింటి కంటే ఎక్కువ ఒత్తిడికి గురైంది నిఫ్టీ ఐటీ (Information Technology). ఐటీ స్టాక్స్‌ అన్నీ తీవ్రమైన అమ్మకాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ ఐటీ ఏకంగా 1043 పాయింట్లు లేదా 3.64 శాతం గల్లంతై, 27,648 దగ్గర ఇవాళ స్టార్టయింది. టెక్‌ వెయిటెడ్‌ నాస్‌డాక్‌లో శుక్రవారం కనిపించిన పతనం ఇవాళ మన ఐటీ స్టాక్స్‌లో కొనసాగించింది.


సోమవారం, బ్లూచిప్ ఐటీ బెహెమోత్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ప్రైస్‌ 7 శాతానికి పైగా క్షీణించి 875.65 వద్దకు చేరుకోగా, టెక్ మహీంద్ర 6 శాతంపైగా దిగజారి రూ.1017.35కి చేరుకుంది.


ఇతర ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఇన్ఫోసిస్ షేరు ధర 5 శాతం క్షీణించగా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సెషన్‌లో ఒక్కొక్కటి 4 శాతానికి పైగా పడిపోయాయి.


టాటా ఎల్‌క్సీ, మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ, సైయెంట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీటీఎస్, జెన్సార్ టెక్నాలజీస్, కోఫోర్జ్, బిర్లాసాఫ్ట్ వంటి సెకండ్‌ రంగ్‌ ఐటీ కౌంటర్లు కూడా ఒక్కొక్కటి 3 నుంచి 7 శాతం వరకు నష్టపోయాయి.


2022లో ఇప్పటివరకు చూస్తే, టెక్నాలజీ స్టాక్స్‌ అత్యంత చెత్త పనితీరును కనబరిచాయి. BSE-100 లూజర్లలో మొదటి ఐదు పేర్లు ఐటీ ప్యాక్‌లోనివే. ఈ ఐదు స్టాక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 45 శాతం వరకు తగ్గాయి. దీనివల్ల పెట్టుబడిదారుల డబ్బు దాదాపు రూ.3.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.


ఐటీ స్టాక్స్‌ ఇంతలా పడడానికి కారణంగా ఎఫ్‌ఐఐల నిర్వాకమే. కక్ష కట్టినట్లు ఐటీ షేర్లనే అన్నింటికంటే వాళ్లు ఎక్కువగా అమ్మేశారు. వీటి వాల్యుయేషన్లు తారాస్థాయికి చేరడమే దానికి కారణం. అంటే, వీటి స్థాయికి మించి వీటిని 2021లో మునగచెట్టు ఎక్కించారు. దీంతో, ఇప్పుడు కొమ్మలు నేలకూలుతున్నాయి. ఐటీ స్టాక్స్‌ తర్వాత ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ను వదిలించుకున్నారు.


విలువ పడిపోతున్న రూపాయి ఇండియన్‌ ఐటీ సెక్టార్‌కు దన్నుగా నిలుస్తున్నా, ఈ రంగం మీద ఎనలిస్టులకు సానుకూల అభిప్రాయం లేదు. ఐటీ స్టాక్స్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశాలే లేవని తేల్చేస్తున్నారు.


ఈ పతనం ఇక్కడితోనే ఆగదని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ కూడా చెబుతోంది. వడ్డీ రేట్ల పెంపులో దూకుడు కొనసాగుతుందని అమెరికన్‌ సెంట్రల్ బ్యాంక్ ‍(US Federal Reserve‌) ఇప్పటికే సిగ్నల్‌ ఇచ్చేసింది కాబట్టి, ఐటీ రంగం ఆ ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదని ఈ బ్రోకరేజీ వెల్లడించింది.


రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ అజిత్ మిశ్రా ప్రకారం... మీడియం టర్మ్ ఔట్‌లుక్‌తో ఐటీ స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. లార్జ్‌క్యాప్స్‌ నుంచి ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌ను ఆయన ఎంచుకున్నారు. మిడ్‌క్యాప్ ప్యాక్ నుంచి మైండ్‌ట్రీ, ఎల్‌టీటీఎస్, సైయంట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌ను ఎంపిక చేసుకున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.