Reliance AGM 2022: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన 45వ వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం వర్చువల్ రియాలిటీ, ఐదు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా నిర్వహిస్తోంది. దీనివల్ల, మిగిలిన వాళ్లు కూడా కూడా లైవ్ అప్‌డేట్స్ పొందవచ్చు. రిలయన్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ వర్చువల్ రియాలిటీ మార్గంలో ప్రసంగిస్తారు.
రిలయన్స్ ఏజీఎం అంటే మార్కెట్‌కు ఎప్పుడూ ఉత్కంఠే, పండగే. ఎందుకంటే, కంపెనీ భవిష్యత్తును నిర్ణయించే అతి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలోనే ముఖేష్ ప్రకటిస్తుంటారు. కాబట్టి ఇవాళ జరిగే ఏజీఎం కోసం మార్కెట్ ఆతృతతో ఎదురు చూస్తోంది.
రిలయన్స్ AGM 2022 నుంచి ఏం ఆశించవచ్చు?
5G సేవలు: మన దేశంలో 5G సేవలు ప్రారంభించడానికి రిలయన్స్ సంస్థ స్ప్రెక్ట్రం తీసుకుంది. దాని బ్లూప్రింట్‌ను నేటి సమావేశంలో ప్రకటిస్తారన్నది మార్కెట్ అంచనా. మొదటి దశలో.. చండీగఢ్, గురుగావ్, ముంబై, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్, పుణె, లఖ్‌నవూ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా దేశవ్యాప్తంగా 12 నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వస్తాయి.
జియోఫోన్ 5G: 5G సేవల రోల్ అవుట్‌తో, కంపెనీ JioPhone 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించవచ్చు. దీని ధర రూ.12,000 లోపు ఉంటుందని అంచనా. ఒక నివేదిక ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,000 - 12,000 మధ్య ఉండవచ్చు. 2021లో JioPhone నెక్స్ట్ తరహాలోనే సరసమైన ధరకు ప్రజలు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేలా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా కంపెనీ తీసుకువస్తుందని భావిస్తున్నారు.
వారసత్వానికి మరింత పట్టు: ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కుమార్తె ఇషా, మరో కుమారుడు అనంత్ కూడా గ్రూప్‌నకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, భార్య నీత అంబానీ, పిల్లల బాధ్యతలు మరింత పెంచుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రకటనలు చేస్తారని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది.
గ్రీన్ ఎనర్జీ: ఈ నెలలోనే ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దీంతో, గ్రీన్ హైడ్రోజన్ ధరను తగ్గించడానికి RIL తన లక్ష్యాలను సవరించుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం... అన్ని పరిశ్రమల్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయోమాస్ వంటి హరిత ఇంధనాల వినియోగానికి తప్పనిసరి పరిమితి వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ కిలో ధరను $1కి తగ్గిస్తామని రిలయన్స్ గతంలో చెప్పింది. అయితే అదానీ నుంచి చాలా గట్టి పోటీ ఉన్నందున, దీనిని మరింత తగ్గించే అవకాశం ఉంది.
టెలికాం, రిటైల్ IPOలు: టెలికాం (జియో), రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లను విడదీసి విడిగా లిస్ట్ చేయాలన్న ప్రతిపాదనలు కొన్నేళ్లుగా నలుగుతున్నాయి. ఈ రెండు కంపెనీల IPOల గురించి ముఖేష్ ఏం తేల్చకుకండా నానుస్తుండడంపై పెట్టుబడిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏజీఎంలో వీటి టైమ్‌లైన్ గురించి ప్రకటన రావచ్చని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు.
ఏజీఎం నేపథ్యంలో, ఇవాళ్టి నెగెటివ్ మార్కెట్‌లోనూ రిలయన్స్ స్టాక్ పుంజుకుంది. రూ.2,585 దగ్గర నష్టంతో ప్రారంభమైన షేరు ధర, అక్కడి నుంచి పుంజుకుంటూ వస్తోంది. ఉదయం 11.15 గం. సమయానికి 2,618.25 దగ్గర ఉంది. శుక్రవారం రూ.2618 దగ్గర ఈ స్టాక్ క్లోజయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.