Jagananna Videshi Vidya Deevena : జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ పథకంలో ఏడాదికి ఇంత మందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. ఈ పథకంలో ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన కారణంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నాగార్జున అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా విదేశీ విద్య అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం జగన్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం జ్ఞానభూమి పోర్టల్ ద్వారా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, జీవోలతో పాటుగా ఆర్థిక సహాయం అందించడానికి ఎంపిక చేసిన క్యూఎస్ 1 నుంచి 200 వరకు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల జాబితాను వెబ్ సైట్ లోనే అందులో ఉంచామన్నారు.
టోఫెల్, జీఆర్ఈ పరీక్షలకు ఉచిత శిక్షణ!
ఈ యూనివర్సిటీలలో 1 నుంచి 100 లోపు క్యూఎస్ ర్యాంక్ కలిగిన యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు కోటి రూపాయలైనా కూడా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంక్ ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తామన్నారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అందరూ ఈ పథకంలో లబ్ధి పొందడానికి అర్హులేనని గుర్తుచేశారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు జగనన్న విదేశీ విద్య కోసం దరఖాస్తులను చేసుకున్నారన్నారు. ఆయా కేటగిరీలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను సాంఘిక సంక్షేమశాఖకు సమర్పిస్తాయని మంత్రి నాగార్జున తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జగనన్న విదేశీ విద్య పథకంలో ఎంత మంది అర్హత సాధిస్తే, అంత మందికీ కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అందుకే ఈ పథకాన్ని అర్హత కలిగిన విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రపంచ స్థాయిలో అత్యధిక ర్యాంకు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించడానికి అవసరమైన టోఫెల్, జీఆర్ఈ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ ఇచ్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని నాగార్జున వెల్లడించారు.
అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందే అభ్యర్థులకు మరింత మెరుగ్గా శిక్షణనను అందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నాగార్జున అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఈ స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ప్రస్తుతం ఇస్తున్న శిక్షణ, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షిస్తూ, అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లకు డైరెక్టర్లను నియమించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సివిల్ సర్వీసెస్ కు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నిరంతరం గ్రంథాలయ సౌకర్యం ఉండేలా చూడాలని సూచించారు. స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీని నియమించడంతో పాటు అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ ను కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా మరింత మెరుగైన శిక్షణను అందించడానికి ఏం కావాలో తనకు ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, జేడీ శ్రీనివాసులు, డిప్యూటీ సెక్రటరీ ముస్తఫా పాల్గొన్నారు.
Also Read : Vinayaka Chaviti 2022 : గణేష్ మండపాల చుట్టూ ఏపీ రాజకీయాలు, ఇంతకీ అనుమతి తీసుకోవాలా? వద్దా?