ప్రాణం అంటే ప్రతీ ఒక్కరికీ తీపే. ప్రాణాలు పోవడం అన్నా తీసే వాళ్లన్నా చాలా మంది భయపడిపోతుంటారు. ముఖ్యంగా మన హిందూ పురాణాల ప్రకారం ప్రాణాలు హరించే ఆ యమలోకాధిపతి మయ ధర్మరాజు అంటే మరింత వణుకుతుంటారు. అందుకే కాబోలు యమ ధర్మరాజుకు గుళ్లు తక్కువ. ఆయనకు పూజలు చేసింది తక్కువ. హిందూ ధర్మం ప్రకారం ఉన్న మూడు కోట్ల మంది దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఒక్క యముడికి తప్ప. కానీ యమధర్మ రాజును మాత్రమే పూజిస్తానని, ఆయనంటే అమితమైన భక్తి ఉందని ఓ వ్యక్తి చెప్తున్నాడు. అయితే అతను ఎవరు, ఆయన కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. యమలోకాధిపతి యమధర్మ రాజును మాత్రమే తాను పూజిస్తాను, ప్రేమిస్తానని అంటున్నాడు. అయన్నే తన కులదైవంగా మార్చుకున్నానని, "గంటి" అనే తన ఇంటి పేరు ముందు "యమ" చేర్చి "యమగంటి" గా మార్చుకున్నట్లు వివరిస్తున్నాడు. అంతే కాదండోయ్ త్వరలోనే యమధర్మరాజుకు తన స్వగ్రామంలోనే ఓ గుడి కూడా కడతాను అంటున్నాడు. 




"నేను యమధర్మరాజు భక్తుడిని. మంజునాథ సినిమా చూసినప్పటి నుంచి ఆయన వీరభక్తుడిగా మారాను. ఆయన అందరినీ సమానంగా చూస్తారు. ఎవరినీ ఎక్కువ, తక్కువ చేయకుండా అందరినీ సమానంగా తీసుకెళ్తారు. నాకు కాలచక్రం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఆయన గురించి కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా బండి మీద ఆయన పేర్లు వేసుకున్నాను. నా చేయి మీద కూడా ఆయన పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను". - శ్రీరామచంద్రమూర్తి, యమధర్మరాభు వీర భక్తుడు




అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గంటి శ్రీరామ చంద్రమూర్తి.. నరుల ప్రాణాలను తన వద్ద ఉన్న యమపాశంతో ఒక్కసారిగా హరించుకుపోయే యమ ధర్మరాజుని తన ఇష్ట దైవంగా మలుచుకొని పూజిస్తున్నాడు. ఏకంగా తన చేతిపై పచ్చ బొట్టు పొడిపించుకోవడమే కాకుండా తన బండిపై యమధర్మరాజుకి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లతో స్టికరింగ్ చేయించుకుని తన భక్తిని అందరికీ తెలుపుతున్నాడు. 


ఆయనే కాదు ఆయన భార్యాపిల్లలు కూడా యమభక్తులే..!


మంజునాథ సినిమా చూసినప్పటి నుంచి యమధర్మరాజుపై అభిమానం, భక్తి పెరిగాయని అంటున్నాడు. జనాలు మాత్రం తన బండిని  విచిత్రంగా చూస్తున్నారు. కేవలం శ్రీరామ చంద్రమూర్తికే కాదండోయ్ ఆయన ఇద్దరు కూతుళ్లకు, భార్యకు కూడా యమధర్మరాజు అంటే చాలా ఇష్టమట.


ఇదండీ శ్రీరామ చంద్రమూర్తి పెట్టుకున్న ఓ యమ భక్తుడి వీర ప్రేమగాథ. ఈయన ఆ ఊరిలోనే కాదు జిల్లాలోనే చాలా ఫేమస్ అయిపోయాడు. ఈయన పేరు చెబితే కొందరు భయపడితే... మరికొందరు విచిత్రంగా చూస్తున్నారు.