తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని, అనుమతి ఇవ్వాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతకుముందు తనను అరెస్ట్ చేసిన సమయంలో తాను కరీంనగర్ జైలుకు వెళ్లొచ్చానని, సీఎం కేసీఆర్ కోసం జైలును సిద్ధం చేశానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రెండేళ్లుగా కేసీఆర్ ను జైల్లో పెడతామంటూ ప్రగల్భాలు పలకడం తప్ప బండి సంజయ్ ఏమీ చేయలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. 


కరీంనగర్ జైలుకు కాంగ్రెస్ నేతలు 
కేసీఆర్ కోసం కరీంనగర్ లో జైలు గదిని ఏర్పాటు చేశానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు జైలును సందర్శించారు. బండి సంజయ్ అబద్దాలకోరు అని, ఆయన మాటల్లో నిజం లేదన్నారు. సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టేందుకు వీలుగా కరీంనగర్‌లో గది కట్టించామని, వరంగల్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యానించారని.. అందుకే జైలును సందర్శించామన్నారు. జైలులోకి వెళ్లేందుకు పొన్నం సహా కాంగ్రెస్ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బీజేపీ నేతలు కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో ప్రత్యేకంగా కట్టించిన గది చూపించాలంటూ గేటు దగ్గర కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.


డిప్యూటీ జైలర్ రియాక్షన్ ఇదీ.. 
సీఎం కేసీఆర్ కోసం కట్టించిన ప్రత్యేక జైలు గదిని చూపించాలని కరీంనగర్ జైలు డిప్యూటీ జైలర్‌ను పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే జైలులో అలాంటి గదులేవీ కట్టించలేదని, అన్ని పాత గదులే ఉన్నాయని డిప్యూటీ జైలర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కోసం బండి సంజయ్ కొత్త జైలు గదిని కట్టించారని చేసిన వ్యాఖ్యలపై జైలు అధికారిని పొన్నం అడిగారు. జైలులో ఎలాంటి కొత్త గదులు నిర్మించలేదని చెప్పడంతో.. బండి సంజయ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి బయటపెడతాం, ఆయనను జైలుకు పంపుతామంటూ బండి సంజయ్ మాటలు చెప్పారే కానీ, ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు కూడా జైలులో ఏర్పాట్లు చేసి వచ్చానంటూ కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 


బీజేపీ పెద్దల సుడిగాలి పర్యటనలు.. రేసులోకి వచ్చేందుకు కాంగ్రెస్ యత్నాలు
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించగా.. అంతలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అత్యుత్సాహంతో కామెంట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను త్వరలోనే జైలుకు పంపిస్తామని, తనను కేసీఆర్ జైలుకు పంపిస్తే.. తాను అక్కడ గులాబీ బాస్ కోసం ప్రత్యేక జైలు గది ఏర్పాట్లు చేసి వచ్చానని వ్యాఖ్యానించారు. తాము రేసులోకి రావాలని భావించిన కాంగ్రెస్ నేతలు జైలు పరిశీలనకు వెళ్లి వాస్తవాన్ని తేల్చేశారు. కరీంనగర్ జైలులో కేసీఆర్ కోసం బండి సంజయ్ ప్రత్యేక గది ఏర్పాటు చేయడంలో నిజం లేదని జైలు అధికారుల మాటలతో స్పష్టమైంది. బండి సంజయ్ అబద్ధాలకోరు అని ఆయన మాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు పొన్నం ప్రభాకర్.