Bandi Sanjay: బీజేపీ నిర్వహిస్తున్న సభలను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, రాష్ట్రం మొత్తాన్ని గులాబీ బాస్ కుటుంబమే కలుషితం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై చీత్కారానికి కారణం కేసీఆర్ యేనని.. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) అమెరికాకి వెళ్లే ముందు, వచ్చే ముందు ఫొటోలకు ఫోజులు కొడతాడంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశాన్ని చూసి గర్విస్తుంటే, కేసీఆర్, కేటీఆర్ లు చైనాను పొగుడుతూ మన దేశాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ స్కాంలోనైనా కేసీఆర్ కుటుంబ సభ్యులు ముందు ఉంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఉన్నామా.. నైజాం పాలనలో ఉన్నామా..!
ఎన్నికల హామీ నెరవేర్చిన ఈ రాష్ట్రంలో మార్పు జరగాలని బండి సంజయ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని, గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీని చూసి ఎన్నో పార్టీలు అవహేళన చేశాయని గుర్తుచేశారు. నేడు అత్యధిక సీట్లతో కేంద్రంలో అధికారంలో ఉన్నామని అన్నారు. బీజేపీ నాయకులపై దాడులు, అరెస్టులు, బెదిరింపులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా నైజాం పాలనలో ఉన్నామా అనే అనుమానం వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం, బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన బండి సంజయ్..
కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వెళ్లాలనుకుంటున్న బీజేపీ నేతల బృందానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ నిపుణులు కలిసి మొత్త 30 మంది వరకు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలనుకుంటున్నట్లు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు బీజేపీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గల కారణాలను గురించి సమాచారం తెలుసుకునేందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. అలాగే తమకు ప్రాజెక్టు నిర్మాణంపై చాలా అనుమానాలు ఉన్నాయని వాటన్నిటిని నివృతి చేసుకోవడానికే బీజేపీ బృందం వెళ్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వరదల వల్ల ప్రాజెక్టులో మోటార్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించడమే బీజేపీ బృందం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
1998 వ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయమని... 2004-2009 మధ్య జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ సర్కారు తమ బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున కూడా ఇరిగేషన్ అధికారులను పంపి మా సందేహాలను నివృత్తి చేయాలన్నారు.