Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వెళ్లాలనుకుంటున్న బీజేపీ నేతల బృందానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ నిపుణులు కలిసి మొత్త 30 మంది వరకు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలనుకుంటున్నట్లు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు బీజేపీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గల కారణాలను గురించి సమాచారం తెలుసుకునేందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. అలాగే తమకు ప్రాజెక్టు నిర్మాణంపై చాలా అనుమానాలు ఉన్నాయని వాటన్నిటిని నివృతి చేసుకోవడానికే బీజేపీ బృందం వెళ్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వరదల వల్ల ప్రాజెక్టులో మోటార్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించడమే బీజేపీ బృందం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
1998 వ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయమని... 2004-2009 మధ్య జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ సర్కారు తమ బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున కూడా ఇరిగేషన్ అధికారులను పంపి మా సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
వరంగల్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు..
సీఎం కేసీఆర్ కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా బీజేపీ కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు బీజేపీ సిద్ధాంతం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామన్నారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు బండి సంజయ్.
"దిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు నన్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ ఒక్కటే కాదు తెలంగాణలో ఈడీ అధికారులు ఏ కంపెనీపై దాడులు చేసినా అందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందో లేదో తెలపాలి. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల లెక్కలు బయటకు తీస్తున్నాం. హిందూ దేవతలపై వ్యంగ్యంగా మాట్లాడిన కమెడియన్ కు 2000 వేల మంది పోలీసుల భద్రత మధ్య షో పెట్టుకోవచ్చు. లిక్కర్ స్కామ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై చర్చ జరగకూడదని మునావర్ షరూఖీని తీసుకొచ్చి ఇక్కడ షో పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ షో పెట్టి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయలబ్ది పొందాలని చూశారు.
పేదల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించడానికి పాదయాత్ర చేస్తే అనుమతి లేదు. అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే బీజేపీని బూచి చూపించి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ టైంలో అధికారంలోకి రావడానికి మత ఘర్షణలు లేవనెత్తారు. సీఎం కేసీఆర్ తన పదవి కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే మతవిద్వేషాలు రెచ్చిగొట్టి బీజేపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు