వేములవాడలోని ఓ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ వ్యవహరించిన తీరుతో విద్యార్థిని ఆస్పత్రి పాలు అయింది. ఆమె కాళ్లకు స్పర్శ లేకుండా పోవడంతో ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో ఈ విషయం కలెక్టర్ వరకూ వెళ్లింది. కన్నెర్ర చేసిన కలెక్టర్ వెంటనే మహిళా లెక్చరర్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ పైనా తగిన చర్యలు తీసుకున్నారు.  


విద్యార్థిని చేసిన చిన్న తప్పునకు లెక్చరర్ మందలించాల్సింది పోయి, కఠిన శిక్ష వేసింది. ఆ ఫలితమే ఆమె కాళ్లకు స్పర్శ తెలియకుండా పోయింది. గత వారం వేములవాడలోని ఓ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థిని ఒక రోజు లీవ్ పెట్టింది. వివిధ కారణాలతో 5 రోజుల పాటు కాలేజీకి రాలేదు. దీంతో ఆగ్రహించిన తరగతి లెక్చరర్ సదరు విద్యార్థినిని అయిదు రోజుల పాటు కాలేజీ టైం మొత్తం నిలబెట్టింది. ఫలితంగా ఆ విద్యార్థిని కాళ్లలో స్పర్శ కోల్పోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జరిగింది. 


రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా.. ఆదివారం వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలానికి చెందిన  ఓ విద్యార్థిని వేములవాడలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 18న అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టి ఆమె ఇంటికి వెళ్లింది. తర్వాత ఆ విద్యార్థిని 23న తిరిగి కాలేజీకి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన ఆ విద్యార్థినిని లెక్చరర్ డి.మహేశ్వరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. 


దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తోటి విద్యార్థుల సాయంతో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు వివిధ పరీక్షలు చేసి అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. అధ్యాపకురాలు మహేశ్వరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న మాతంగి కల్యాణిపై తగిన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రిన్సిపల్‌ కల్యాణి శనివారం ట్రాన్స్‌ఫర్ పై వెళ్లిపోయారు.


వేములవాడ కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి
శనివారం వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. లా కార్యదర్శిగా ఉన్న సమయంలో నేను 50 కోర్టులు మంజూరు చేశానని అన్నారు. ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరించిందని అన్నారు. కోర్టు భవనం చిన్నదిగా ఉన్నందున భవనం పై అంతస్తు నిర్మాణానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశామని అన్నారు. తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పరిపాలన మరింత విస్తరించిందని అన్నారు.