Minister Ambati Rambabu Comments : ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)... తెలుగుదేశం పార్టీ (Tdp)అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై విరుచుకుపడ్డారు. మునిగిపోయే నావను కాపాడుకోవాలనే చంద్రబాబు తాపత్రయ పడుతున్నాడని... మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, వంగవీటి మోహనరంగాను చంపిందెవరని ప్రశ్నించారు. కల్లబొల్లి ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేశారన్న ఆయన, 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదన్నారు. వరికపూడిశెలకు అనేక సార్లు శంకుస్థాపన చేశావు కదా..? నీ 14 ఏళ్ల హయాంలో ఈ పథకం నీకు గుర్తుకు రాలేదా ? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పల్నాడు డ్రాట్‌ మిటిగేషన్‌ స్కీం కూడా చంద్రబాబుకు ఇంతకు ముందు గుర్తుకు రాలేదని, నరసరావుపేట పార్లమెంటులో ఉన్న 7 మంది శాసనసభ్యుల జాతకాలు రాస్తున్నాడట అంటూ మండిపడ్డారు.


పుస్తకాలు రాసి ఏం చేసుకుంటారయ్యా ?
ఈయన చిత్రగుప్తుని చిట్టా రాస్తాడట, వాళ్ల అబ్బాయి ఎర్ర బుక్కు రాస్తాడట... ఈ పుస్తకాలు రాసి ఏం చేసుకుంటారయ్యా అంటూ  అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చేది లేదని... నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించి చూపించాలని సవాల్ విసిరారు. కాసు మహేష్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని, వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేక పదవులు నిర్వహించిందన్నారు. మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి ఎందుకు చెప్పవని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఆ 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను... ప్రజలు ఓడించి పల్నాడులో చరిత్ర సృష్టించారని అన్నారు. 


ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో చిట్టా విప్పుతా?
ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో చిట్టా విప్పుతా.. తస్మాత్‌ జాగ్రత్త అంటూ చంద్రబాబును హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు. తనను ఆంబోతు అన్నప్పుడల్లా... తాను అంటూనే ఉంటానన్నారు. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అని విమర్శించారు.  ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో కూడా చిట్టా విప్పుతానన్నారు. తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... నువ్వు ఒక మోసగాడివి, 420 అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్ని, ఎన్టీఆర్‌ను మోసం చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో నీకు నూకలు చెల్లాయని.. నీకూ, నీ పార్టీకి భవిష్యత్తు లేదంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 


కోడెల హత్యకు కారణం ఎవరు ? 
కోడెల శివప్రసాద్‌రావు తనపై పోటీ చేసి ఓ సారి గెలిచాడని.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడన్నారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోడానికి ఎవరు కారణం..? ఆయన మరణానికి ప్రధాన కారణం చంద్రబాబేనని అంబటి ఆరోపించారు. ఆయన ఓటమి పాలైన తర్వాత కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదన్న అంబటి... ఆయన్ను, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టాలని నువ్వు నిర్ణయించుకున్నది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. అందుకే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యయత్నం చేసుకున్నారని అన్నారు.  ఆయన్ను పలకరిద్దాం అని పత్తిపాటి పుల్లారావు అడిగితే ఆ దుర్మార్గుడ్ని పలకరించవద్దు అన్నది చంద్రబాబు కాదా అని నిలదీశారు. శత్రువులకు కూడా భయపడని కోడెల... చంద్రబాబుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. దాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్న అంబటి రాంబాబు... ఆయనపై, ఆయన కుటుంబంపై మీకు ఇంకా కక్ష పోలేదు కాబట్టి పక్కన పెట్టావంటూ విమర్శలు గుప్పించారు.


అవన్నీ అవాస్తవాలు 
తాకట్టులో సచివాలయం అంటూ పచ్చ మీడియా పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తోందన్నారు అంబటి. వాళ్లు రాయడం.. చంద్రబాబు అండ్‌ కో దాని గురించి మాట్లాడటం రివాజుగా మారిందన్నారు. సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడం పూర్తిగా అవాస్తవమన్న ఆయన,  ఏదో ఒక విధంగా జగన్‌ పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. పచ్చి అవాస్తవాలను రాసి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమన్న ఆయన... చంద్రబాబు వార్నింగ్‌లు ఇవ్వడం ఊసుబోని సొల్లు కబుర్లుగా భావిస్తామన్నారు. పల్నాడులో శాంతిభద్రతలు చంద్రబాబు కాలంలో కంటే చాలా బేషుగ్గా ఉన్నాయన్నారు.