Rains In AP: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదివరకే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ఏపీ, తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇండోనేషియా భూకంపం వల్ల సునామీ ఏర్పడినా మన దేశాన్ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.
ఏపీలో చల్లచల్లగా..
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతం ప్రభావంతో మేఘాలు ఏర్పడి ఏపీ మేఘావృతమై ఉంటుంది. విశాఖ, అనకాపల్లి, గోదావరి జిల్లాలు మేఘావృతమై ఉండగా.. సాయంకాలానికి బాగా ఉక్కపోతను మారే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, పాడేరు జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రత సైతం భారీగా పెరుగుతుంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయి. రుతుపవనాల సీజన్ లో అధిక వర్షపాతాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలుంటాయి. కానీ ఈసారి గత మూడు సంవత్సరాల్లాగ వర్షాలు కురుస్తూనే ఉండవు. వారం పాటు సైతం గ్యాప్ తరువాత వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరో వైపున రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వేడిగా ఉండనుంది. రాయలసీమలోనూ కొన్ని జిల్లాలకు ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. మరోవైపు వర్షాలు లేని ప్రాంతాల్లో నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో నేడు సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరగనున్నాయి. మరో వైపున హైదరాబాద్ మీదుగా మేఘాలు మెళ్లగా తూర్పు తెలంగాణ వైపుగా ఉంటాయి. కనుక ఈ రోజు హైదరాబాద్ లో తేమ తక్కువగా ఉంటుంది. ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బంది పడతారు. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు.