AP Weather News: నైరుతి అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్ప పీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో ఈశాన్య, తూర్పు దిశల్లో గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక, ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


‘‘నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. అలాగే మధ్యాహ్నం నుంచి సాయంకాలానికి వెళ్లేసరికి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా చెల్లాచెదురుగా వర్షాలుంటాయి. ఏలూరు, ఎన్.టీ.ఆర్., ఉభయ గోదావరి, కొనసీమ​, కాకినాడ​, గుంటూరు, పల్నాడు, పశ్చిమ ప్రకాశం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలను చూడగలము, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఒకటి - రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం కానుంది.


సాయంకాలం నుంచి అర్ధరాత్రి మధ్యలో కర్నూలు జిల్లా పశ్చిమ భాగాలు (ఆదోని - పత్తికొండ వైపు), అలాగే అనంతపురం జిల్లాలోని పలు భాగాలు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలుంటాయి. నేడు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా సాయంకాలం, రాత్రి వర్షాలను చూడగలం. చిత్తూరు, తిరుపతి పశ్చిమ భాగాలు, నెల్లూరు జిల్లాలోని మిగిలిన భాగాల్లో సాయంకాలం కొన్ని వర్షాలుంటాయి. విశాఖ నగరంలో వర్షాలకు అవకాశాలు తక్కువగానే ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలంగాణలో ఇలా..
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.


నవంబర్ 8న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది.