ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్తాన్ పై మాజీ చాంపియన్ ఆసీస్ ను విజేతగా నిలిపాడు మ్యాక్సీ. అప్గాన్ బౌలర్ల దాటికి 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓ దశలో 91/7 గా కనిపించిన ఆసీస్ నెగ్గుతుందని ఎవరూ భావించలేదు. కానీ మ్యాక్స్ వెల్ తన వన్డే కెరీర్ లో తొలి డబుల్ సెంచరీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాక్స్‌వెల్ (201 నాటౌట్; 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అద్వితీయ ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆసీస్ ఆర్ రౌండర్ మ్యాక్స్ వెల్ నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ తో పాటు క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ అయ్యాడు.
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా అఫ్గాన్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ సిక్సర్ తో డబుల్ సెంచరీ సాధించాడు. సెంచరీ తరువాత కండరాలు పట్టేసి, కాలు నొప్పి వేధిస్తున్నా ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకుంటూ దాదాపుగా స్ట్రైకింగ్ భారాన్ని, జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పాట్ కమిన్స్ (12 నాటౌట్) మరో ఎండ్ లో వికెట్ కాపాడాడు. ఓ దశలో మ్యాక్స్ వెల్ బాధను చూడలేక టీమ్ మేనేజ్ మెంట్ అతడ్ని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పిలిపించి స్పిన్నర్ ఆడమ్ జంపాను బ్యాటింగ్ కు పంపించాలని చూసింది. అప్పుడు సైతం ఆసీస్ విజయానికి మరో 50 పరుగుల మీదే అవసరం ఉంది. కానీ పట్టుదలగా ఆడిన మ్యాక్స్ వెల్ పలు రికార్డులు బద్దులకొట్టాడు. జట్టును గెలిపించే క్రమంలో 158 వ్యక్తిగత పరుగులు దాటడంతో అద్భుత రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ప్రపంచ కప్ లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ పేరిట ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో భారత్ పై స్ట్రాస్ చేసిన 158 పరుగుల రికార్డు బద్ధలైంది. ఆపై ఇన్నింగ్స్ 47వ ఓవర్లో 195 వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ అయ్యాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో జరిగిన వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ 193 పరుగుల వద్ద రనౌటయ్యాడు. కానీ ఆ మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. కాగా, మ్యాక్సీ తాజా ఇన్నింగ్స్ కు ముందు ఫకర్ జమాన్ 193 రన్స్ వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. ఈ జాబితాలో షేన్ వాట్సన్ (185) మూడో స్థానంలో ఉన్నాడు. 2005లో శ్రీలంకపై ఎంఎస్ ధోనీ (183), 2012లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ (183) ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.
ఓవరాల్ గా చూస్తే.. వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మ్యాక్స్ వెల్. వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో సైతం ఛేదనలో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్సీదే కావడం విశేషం.