91 పరుగులకు ఏడు వికెట్లు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా స్కోరుది. విజయానికి మరో 201 పరుగుల దూరంలో ఉన్న కంగారులకు అఫ్గానిస్థాన్‌ షాక్‌ ఇవ్వటం ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఒక్కడు నిలబడ్డాడు. అఫ్గాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ... కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆసిస్‌కు ఈ ప్రపంచకప్‌లోనే మధురమైన విజయాన్ని అందించాడు. ఆ విధ్వంసర ఆటగాడే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన మ్యాక్సీ... కాలు నొప్పిని పంటి బిగువున భరిస్తూ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేసిన అఫ్గాన్‌ దానికి భారీ మూల్యం చెల్లించుకుంది. గ్లెన్‌ విధ్వంసంతో అసలు గెలుస్తుందా లేదా అన్న స్థితి నుంచి ఆస్ట్రేలియా మరచిపోలేని విజయం సాధించింది. వచ్చిన అవకాశాలను చేజార్చుకుని... అఫ్గాన్‌ సెమీస్‌పై ఆశలను కూడా వదిలేసుకుంది.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌... ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేయడంతో అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఆరంభం నుంచే అఫ్గాన్‌ ప్లేయర్లు ఆచితూచి ఆడడంతో పరుగుల రాక కష్టమైంది. ఎనిమిది ఓవర్లలో 38 పరుగుల వద్ద అఫ్గాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం రహ్మత్‌ షా..ఇబ్రహీం జద్రాన్ అఫ్గాన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కంగారు బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్న ఈ ఇద్దరు స్కోరును 100 పరుగులు దాటించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మాక్స్ వెల్ విడదీశాడు.


ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇబ్రాహీం జద్రాన్ పోరాటం ఆపలేదు. సెంచరీ పూర్తి అయిన తరువాత భారీ షాట్ లతో విరుచుకు పడ్డాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో జద్రాన్‌ 129 పరగులతో అజేయంగా నిలిచాడు. రహమ్మద్ షా 30, షాహిదీ 26, ఓమరాజాయ్ 22 పరుగులతో రాణించారు. చివర్లో రషీద్ ఖాన్ మెరుపు బాటింగ్ చేశాడు. రషీద్ ఖాన్ 18 బంతుల్లో 2 ఫోర్ లు, మూడు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. చివర్లో జద్రాన్‌, రషీద్‌ఖాన్‌ మెరుపు బ్యాటింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.


 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు అఫ్గాన్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. నాలుగు పరుగుల వద్ద ట్రానిస్‌ హెడ్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత కంగారుల పతనం వేగంగా సాగింది. చూస్తుండగానే ఆస్ట్రేలియా 91 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌ ఇద్దరే మిగిలారు. వీళ్లిద్దరే మ్యాచ్‌ను ముగించారు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసంతో అఫ్గాన్‌ బౌలర్లు కొట్టుకుపోయారు. అద్భుత ద్విశతకంతో మ్యాక్స్ వెల్‌ కంగారులకు అదిరే విజయాన్ని అందించాడు. మ్యాక్స్‌వెల్‌ కొట్టిన ప్రతీ బంతి బౌండరీ దాటింది. గట్టిగా కొడితే సిక్సు... నిలబడి కొడితే ఫోర్‌ అన్నట్లుగా మారిపోయింది. పరిస్థితి. ఆ విధ్వంసం అలా ఇలా సాగలేదు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ చేసిన 201 పరుగుల్లో 144 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. మ్యాక్స్‌వెల్‌కు కమ్మిన్స్‌ చక్కని సహకారం అందించాడు. 68 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంతో 46.5 ఓవర్లలో మరో 19 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది.