AP Weather News: ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి (మార్చి 24) వచ్చే 5 రోజుల పాటు వర్ష సూచన ఏమీ లేదు. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 






మరోవైపు, ఏపీలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. నిన్న అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద  తీరాన్ని దాటింది. దీని ప్రభావం స్వల్పంగా ఏపీపైనా కనిపించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడింది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ. దాకా వీచింది.






ఇవి పూర్తిగా అకాల వర్షాలని.. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, పెద్ద చెట్ల కింద​, విద్యుత్ స్తంభాల కింద ఉండటం అంత మంచిది కాదని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక నేటి నుంచి మధ్యాహ్నం కాస్త తేమ, ఉక్కపోత ఉండే అవకాశం ఉంది.



తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
Telangana Weather: తెలంగాణలో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతల నుంచి తాజా వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికంగా మహబూబ్ నగర్, మెదక్‌లలో 39.6 డిగ్రీలుగా నమోదైంది. మొన్నటివరకు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు చేసిన నల్గొండలో 39.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట ప్రాంతాల్లో వర్షం కురిసినట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. 23న అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 18.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.