వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ బయటకు వచ్చి ‘నథింగ్’ అనే కంపెనీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పటికే నథింగ్ ఇయర్ (1) పేరుతో ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) అనే స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ మనదేశంలో 2022 మూడో త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) లాంచ్ కానుందని కార్ల్ పెయ్ ప్రకటించారు.


ఈ ఫోన్ ఏకంగా యాపిల్‌‌కే పోటీనిచ్చే స్థాయిలో ఉండనుందని కార్ల్‌ పెయ్ ప్రకటించారు. ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే నథింగ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ నథింగ్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ అధికారికంగా ఏప్రిల్‌లో లాంచ్ చేయనుంది.


నిద్రావస్థలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని కొత్త దారివైపు మళ్లించేలా నథింగ్ ఫోన్ (1) ఉండనుందని కార్ల్ పెయ్ తెలిపారు. ఈ ఫోన్ ఒక ప్రత్యేకమైన, విభిన్నమైన డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. క్వాల్‌కాం ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. శాంసంగ్, సోనీ, విజియోనాక్స్ వంటి కంపెనీలు నథింగ్‌కు కీలక భాగాలను సరఫరా చేయనున్నాయి.


ఈ స్మార్ట్ ఫోన్‌కు మూడు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు డిజైన్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఉండే కీలక భాగాలు కూడా బయటకు కనిపిస్తాయని తెలుస్తోంది.


నథింగ్ ఓఎస్ లాంచర్‌ను కంపెనీ ఏప్రిల్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లకు అందుబాటులోకి రానుంది. ఎటువంటి బ్లోట్‌వేర్ లేదా హెవీ సిస్టం యాప్స్ ఇందులో అందించడం లేదని కంపెనీ అంటోంది. డాట్ మాట్రిక్స్ తరహా ఫాంట్‌తో ఈ ఇంటర్‌ఫేస్ ప్రత్యేకంగా కనిపించనుంది.


దీంతోపాటు డైనమిక్ ర్యామ్ కాచింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువగా ఉపయోగించే యాప్స్ వేగంగా లాంచ్ కానున్నాయి. ఇందులో ప్రత్యేకమైన డిజైన్ కూడా ఉండనుంది. వాయిస్ రికార్డర్ వంటి ఫస్ట్ పార్టీ యాప్స్ ఇందులో మినిమలిస్ట్ డిజైన్‌తో కనిపించనున్నాయి.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?