iPad Air (2022): ఐప్యాడ్ ఎయిర్ (2022)ని యాపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ (2022)తో పాటు ఇది కూడా లాంచ్ అయింది. ఇందులో యాపిల్ ఎం1 చిప్‌ను అందించారు. ఇందులో ముందువైపు అప్‌గ్రేడ్ చేసిన కెమెరాను అందించారు. 2020లో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ తరహాలోనే దీని డిజైన్ ఉంది.


ఐప్యాడ్ ఎయిర్ (2022) ధర
ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. వైఫై ఓన్లీ మోడల్‌లో 64 జీబీ వేరియంట్ ధరను రూ.54,900గా నిర్ణయించారు. ఇక వైఫై + సెల్యులార్ మోడల్‌లో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900గా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్‌లోనూ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందించారు. మార్చి 18వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.


ఐప్యాడ్ ఎయిర్ (2022) స్పెసిఫికేషన్లు
ఐప్యాడ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10.9 ఎల్ఈడీ బ్యాక్‌లిట్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. 2020లో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా ఇదే డిస్‌ప్లేను అందించారు. టచ్ ఐడీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. పవర్/స్టాండ్‌బై బటన్‌లో ఈ టచ్ ఐడీ అందించారు. ఇందులో ఎం1 చిప్‌ను అందించారు.


గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ కంటే 60 శాతం వేగంగా దీని సీపీయూ పెర్ఫార్మెన్స్ ఉండనుంది. గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఏకంగా రెండు రెట్లు వేగంగా ఉండనుంది. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక ముందువైపు కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.


64 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్కెచ్‌లు వేసుకోవడానికి ఇందులో యాపిల్ పెన్సిల్ (రెండో తరం) సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!