Realme New Phone: రియల్‌మీ సీ35 స్మార్ట్ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. యూనిసోక్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.
రియల్‌మీ సీ35 ధర
ఇందులో రెండు వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,799 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.13,350) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,299 యువాన్లుగా (సుమారు రూ.14,500) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ వాటర్ డ్రాప్ నాచ్‌ను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉండనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు మాక్రో కెమెరా, బ్లాక్ అండ్ వైట్ పొర్‌ట్రెయిట్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. జీపీఎస్/ఏ-జీపీఎస్, యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా.. బరువు 189 గ్రాములుగా ఉంది.