అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్.ఆర్.ఐలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడేళ్ల క్రితం ఇక్కడే, ఈ గదిలో, పసికూన లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు పరిచయం చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ సక్సెస్ స్టోరీ చెప్పడానికి వచ్చానన్నారు.
ఇదీ విజయగాథ
2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని మంత్రి కేటీఆర్ ఎన్.ఆర్.ఐలకు వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం ఒక లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటే అది ఇప్పుడు 130 శాతం పెరిగిందన్నారు. రెండు లక్షల డెబ్బైవేల రూపాయలుగా ఉందన్నారు. నాడు రాష్ట్ర జీఎస్‌డీపీ(GSDP) 4.9 లక్షల కోట్ల రూపాయలైతే నేడు 11.54 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు కేటీఆర్. భౌగోళికంగా దేశంలో తెలంగాణ 11 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 12 వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధిలో నాల్గో అతిపెద్ద వాటాదారు తెలంగాణ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న తెలంగాణ, దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు సపోర్ట్‌గా నిలుస్తోందన్నారు. ఎవరూ ఊహించని విధంగా కరెంట్ సమస్యను పరిష్కరించి దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిక్సూచీలా నిలిచారన్నారు కేటీఆర్. కేవలం ఏడేండ్లలోనే మన స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెండింతలు కావడం తెలంగాణ ప్రబలశక్తికి నిదర్శనమన్నారు.
అన్నింటిలోనూ టాప్
పర్యావరణహితంగా తెలంగాణలో అభివృద్థి జరుగుతోందన్న కేటీఆర్, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 15 శాతం వాటా పునరుత్పాదక వనరులదే అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 40 మెగావాట్లగా ఉన్న స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం ఇవాళ 5000 మెగావాట్లకు చేరిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు కేటీఆర్. ఇక పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.
కేంద్రం చేతులెత్తేసింది
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ చెప్పారు. కేవలం 4 ఏళ్లలోనే కాళేశ్వరంలాంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తెలంగాణ సత్తాను ప్రపంచానికి చూపించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణలో పండిన పంటను కొనలేమని భారత ఆహార సంస్థ చేతులెత్తేసిందని కేటీఆర్ గుర్తుచేశారు.
ఐటీలో మేటీ
టీఎస్ ఐపాస్ లాంటి వినూత్న విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత తెలంగాణదే అన్నారు మంత్రి కేటీఆర్. కేవలం 21 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను ఇస్తున్నామన్నారు. 19వేల కంటే ఎక్కువ పరిశ్రమలకు అనుమతులివ్వడంతో 2.3 లక్షల కోట్ల రూపాయాలు పెట్టుబడులు వచ్చాయన్నారు. టీఎస్ ఐపాస్ చట్టంతో ఇప్పటివరకు సుమారు 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించిందని తెలిపారు.
వైద్యంలో నెంబర్ వన్
ఇవాళ వైద్య రంగంలో ఎవరూ ఊహించని విధంగా మౌలిక వసతుల కల్పన తెలంగాణలో జరుగుతోందన్న మంత్రి కేటీఆర్ గతంలో 3 వైద్య కళాశాలలే ఉంటే ఈ ఏడేండ్లలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే 20 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ అంటే కేవలం హైటెక్ సిటీ అనే భావనను మారుస్తోందన్నారు కేటీఆర్. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని ఇతర పట్టణాలకు కూడా ఐటీని విస్తరిస్తున్నామన్నారు.
బడిని దత్తత తీసుకోండి
ఈ కార్యక్రమంలో మన ఊరు-మన బడి పోర్టల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే అలోచన మీలో ఉంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని బడిని దత్తత తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విజయ యాత్రలో భాగం కావాలనుకుంటే పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలన్నారు.
పెట్టుబడులతో రండీ
ఎన్.ఆర్.ఐల సమావేశం తరువాత మంత్రి కేటీఆర్ ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ సాగింది. కరోనా పాండమిక్ ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుత అవకాశాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వాళ్లను ఆహ్వానించారు.