నైరుతి రుతుపవనాలు రాగల 2, 3 రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (జూన్ 21) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.


రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు  అక్కడక్కడ వడగాల్పులు  రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,హన్మకొండ మరియు వరంగల్   జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వీచే అవకాశం ఉంది.


నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్ర వడ గాలులు, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడ గాలుల పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో నిన్న (జూన్ 21) సాయంత్రం ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. గోల్కొండ, మెహదీపట్నం, షేక్‌పేట్, ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లిలో భారీ వర్షం పడింది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
రుతుపవనాలు బలంగా ఉండటం వలన నేడు రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా బెంగళూరుకి దగ్గరగా ఉన్న భాగాలైన అన్నమయ్య​, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు, తీవ్రమైన పిడుగులు నమోదవుతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. కర్నూలు, నంధ్యాల, కడప జిల్లాలోని తూర్పు భాగాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుందని, నెల్లూరు జిల్లా ఉత్తర భాగాల నుంచి వస్తున్న బలమైన వర్షాలు నెల్లూరు నగరంలో ఉంటాయని తెలిపారు. ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీగా నెల్లూరులో ఉండనుంది. మరో వైపున ప్రకాశం జిల్లాలో విస్తారంగా తేలికపాటి వర్షాలు, ఎన్.టీ.ఆర్., ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరిస్తాయని తెలిపారు.


తొలకరి వర్షాలు ఏపీలో మరో రెండు రోజుల్లో పూర్తి అవుతాయని తెలిపారు. దీని వల్ల నేడు, రేపు ఉత్తరాంధ్ర​, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయన్నారు. నేడు మంచి వేడితో మొదలైనా రుతుపవనాలు ప్రభావంతో సాయంకాలం, రాత్రి సమయాల్లో వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, అనకాపల్లి, పాత్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా ఉంటాయని తెలిపారు. అలాగే మధ్య ఆంధ్ర జిల్లాలైన కాకినాడ​, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నేడు, రేపు విస్తారంగా వర్షాలు ఉంటాయని తెలిపారు. నేడు కూడా ఎన్.టీ.ఆర్., కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్యలో చూడగలమని చెప్పారు. అలాగే రాత్రి సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూడగలమని చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి, అన్నమయ్య​, కడప​, చిత్తూరు జిల్లాలతో పాటుగా తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని తెలిపారు.