Weather News: తెలంగాణలో నేడు దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 44 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇవి కాక మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. ‘‘ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారు.
నిన్న విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు.