Bear Attack on Zoo Park Emplyoee in Visakha: విశాఖ జూపార్కులో (Visakha Zoo Park) సోమవారం ఉదయం విషాదం జరిగింది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జూ కీపర్ గా విధులు నిర్వహిస్తున్న బానవరపు నగేష్ (25) అనే యువకునిపై ఎలుగు బంటి దాడి చేసింది. విజయనగరం జిల్లా గజపతినగరానికి (Gajapathinagaram) చెందిన నగేశ్ విశాఖ వెల్ఫేర్ సొసైటీ (Visakha Welfare Society) ద్వారా గత రెండేళ్లుగా జూలో పని చేస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిన సలేరియా తెలిపారు. ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. దాడి చేసిన జిహ్వాన్‌ అనే ఎలుగుబంటిని మిజోరాం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు. ఈ ఘటనతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


తలుపులు ఎలా తెరుచుకున్నాయ్.?


అయితే, జూపార్కులో ఎలుగు బంటి ఉంచిన బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియడం లేదని సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలోనే ఎలుగు బోనులోనే ఉందనుకుని నగేష్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడితో జూపార్కులో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


Also Read: Andhra News YSRCP : హిందూపురం వైసీపీలో అంతే - బాలకృష్ణకు ముందుగానే భారీ మెజార్టీలు వస్తాయని జోస్యం !