Qatar Death Penalty: 


8 మందికి ఉరిశిక్ష..


ఖతార్ ప్రభుత్వం భారత నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడం సంచలనమైంది. ఒకేసారి 8 మంది అధికారులకు మరణ దండన విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుని సవాల్ చేస్తామని తేల్చి చెప్పింది. అయితే...ఈ 8 మంది నేవీ అధికారుల్లో ఒకరు వైజాగ్ వాసి కూడా ఉన్నారు. ఆయనే కమాండర్ సుగుణాకర్ పాకాల. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుని కలిసి సాయం కోరారు.ఈ అభ్యర్థనను స్వీకరించిన జీవీఎల్ వెంటనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారు. అదే సమయంలో ఖతార్‌లోని భారత రాయబారితోనూ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఈ తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది.   


ఏం జరిగిందంటే..?


2022 ఆగస్టులో 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులు ఖతార్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిలో కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్‌ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కేప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కేప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కేప్టెన్ సౌరభ్ వశిష్ఠ్‌, సెయిలర్ రాగేశ్ గోప కుమార్ ఉన్నారు. వీళ్లందరికీ నేవీలో 20 ఏళ్ల సర్వీస్‌ ఉంది. 2019లో కమాండర్ పూర్ణేందు తివారికి ప్రావసి భారతీయ సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. అసలు వీళ్లంతా ఖతార్‌కి ఎందుకు వెళ్లారన్నదే కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఖతార్‌లోని ప్రైవేట్ కంపెనీ అయిన Dahra Global Technologiesలో వీళ్లు పని చేశారు. ఈ కంపెనీకి రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ ( Royal Oman Air Force) కి చెందిన రిటైర్డ్ స్వాడ్రన్ లీజర్ ఖమీస్ అల్ అజ్మీ (Khamis al-Ajmi) ఓనర్. గతేడాది ఖమీస్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత వెంటనే విడుదల చేశారు. మిగతా 8 మంది మాత్రం జైల్లోనే ఉండిపోయారు. చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్‌పై వీళ్లంతా పని చేస్తున్నారు. వీళ్లు ఖతార్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఖతార్‌కి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయేల్‌కి చేరవేస్తున్నారని ప్రభుత్వం మండి పడింది. గూఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష విధించింది. ఏడాదిగా జైల్లో ఉంటున్న ఈ 8 మంది అధికారులు బెయిల్‌ కోసం చాలా సార్లు అప్లై చేసుకున్నారు. కానీ అందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. పైగా ఇప్పుడు ఏకంగా ఉరిశిక్ష విధించింది. 


భారత్ స్పందన ఇదే..


ఈ తీర్పుతో షాక్‌కి గురైంది భారత్. విదేశాంగ శాఖ వెంటనే అప్రమత్తమైంది. పూర్తి తీర్పు ఇంకా రాలేదని, అది చదివిన తరవాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లీగల్‌ పరంగా ఉన్న అన్ని దారులనూ వెతుకుతున్నట్టు వెల్లడించింది. వీలైనంత వేగంగా అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. 


Also Read: హమాస్ దాడులు కార్గిల్ యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాయి - ABP న్యూస్‌తో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్