వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను హైదరాబాద్ తీసుకువెళ్తున్నారు. సాయంత్రం లోపు సీబీఐ జడ్జి ఎదుట ఆయన్ను హాజరుపర్చే అవకాశం ఉంది. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. 


‘‘భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించాం. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చేవరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నారు. ఇంట్లో సునీల్ ఉన్న సమయంలో తన రెండు ఫోన్లు భాస్కర్ రెడ్డి స్విచ్ ఆఫ్ చేశారు. 2019 మార్చి 14న భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నారు. 14న సాయంత్రం 6.14 నుంచి 6.31 వరకూ భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. వివేకా ఓటమిలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఓటమి తర్వాత భాస్కర్ రెడ్డి, అవినాష్, దేవిరెడ్డిపై వివేకానంద రెడ్డి మండిపడ్డారు. వివేకా వల్ల రాజకీయ ఎదుగుదల ఉండబోదని భాస్కర్ రెడ్డి భావించారు. రాజకీయంగా అడ్డు తొలగించుకొనేందుకు హత్య చేయించి ఉంటారు.


ఇప్పటిదాకా అయిన అరెస్టులు ఇవీ


వివేకా హత్య కేసులో ఇప్పటిదాకా సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, నేడు భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ4 దస్తగిరి బెయిల్ పై ఉన్నారు. 2021 ఆగస్టు 2న ఏ-2 సునీల్ యాదవ్ అరెస్టు అయ్యారు. 2021 సెప్టెంబరు 9న ఏ-3 ఉమాశంకర్ రెడ్డి అరెస్టు అయ్యారు. అదే ఏడాది నవంబరు 17న ఏ-5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఈ నెల 14న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు కాగా, నేడు ఉదయం పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఇక ఇప్పటిదాకా భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


నేడు ఉదయమే భాస్కర్ రెడ్డి అరెస్టు


పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి ఆదివారం తెల్లవారుజామునే (ఏప్రిల్ 16) రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం చర్చనీయాంశం అయింది.