ఏపీ బీజేపీ ఛీప్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత దగ్గుపాటి పురందేశ్వరి స్పీడ్ పెంచారు. అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు.. కట్టిన ఇళ్లకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ జేబులు నింపుకోడానికి ఏపీ పాలకులు పాకులాడుతున్నారని మండిపడ్డారు. చేసిన అప్పులు, కట్టిన ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అనధికారికంగా రూ. 4.74 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆమె ఆరోపించారు.
విశాఖకు కేంద్ర ప్రభుత్వం లక్షా 57 వేల ఇళ్లు ఇచ్చిందని, ఏపీలో జగన్ ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వైజాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ పెట్టిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆమె అన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తే ఇక సామాన్యుల గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కరోనా సమయంలో శ్లాబులు మార్చి ప్రజలపై వెయ్యి 500 కోట్ల రూపాయల భారం వేసినట్లు ఆమె ఆరోపించారు.
పురందేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా సమాధానమిస్తున్నారు. అందులోనూ పొలిటికల్ పంచ్‌లు వేయడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్టైలే వేరు. వైసీపీపై వరసపెట్టి విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ చీఫ్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు అంటూ ఎద్దేవా చేశారు. మీ నాన్నాగారు(ఎన్టీఆర్) మహానటులు.. మీరు(పురంధేశ్వరి) కాదనుకున్నాం అంటూ పొలిటికల్ పంచ్ విసిరారు. 2013లో పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పురందేశ్వరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పుందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. అందులో ‘వెన్నుతట్టి ప్రొత్సహించిన నాయకురాలు, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీకి, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ పత్రికా ప్రకటనలు సైతం చేశారు.
దానిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘అమ్మా, పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్.. వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్!. మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!’ అంటూ ఘాటుగా కామెంట్స్ పెట్టారు. అప్పడు పురందేశ్వరి వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనను సైతం అటాచ్ చేశారు.