Srikakulam News: వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. ఇంట్లో నుంచి దువ్వాడ బయటకు రావడం లేదు. ఇంటి బయటే ఆయన భార్య కుమార్తెలు టెంట్ వేసుకొని ధర్నాకు కూర్చొని ఉన్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని చెప్పిన స్నేహితురాలు మాధురి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ స్టోరీకి ఇక్కడే ఇంటర్వెల్‌ బ్యాంగ్ పడింది. 


ప్రతిచోటా ఇదే చర్చ


తర్వాత ఏం జరుగుతుందని చాలా మందిలో ఆసక్తి నెలకొంది. తెలుగు సీరియల్‌లో ఉండే ట్విస్టులు ఈ రియల్ స్టోరీ జుజూబీలనే టాక్ నడుస్తోంది. ఇక్కడితే స్టోరీకి ఎండ్ కార్డు పడుతుందనుకునేలోపు మరో ‌ట్విస్ట్‌ సంచలనంగా మారుతోంది. మొత్తానికి దువ్వాడ వారి కథా చిత్రం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆసక్తి మాత్రం చాలా మందిలో కనిపిస్తోంది. సిక్కోలులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ పొలిటికల్ రొమాంటిక్ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. 


ఆసుపత్రిలో మాధురి- చూడాలని ఉందంటున్న దువ్వాడ


ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మాధురి గురించి తాజాగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తక్షణమే వెళ్లి ఆమెను చూడాలని ఉందన్నారు. అయితే తాను వెళ్లిన మరుక్షణమే తన ఇంటిని వాణి, కుమార్తెలు ఆక్రమించుకుంటారని ఆరోపించారు. అప్పుడు తాను నిలువనీడలేని వ్యక్తిగా రోడ్డున పడాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే వెళ్లి మాధురిని చూడాలని ఉన్నా చూడలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. 


మరోవైపు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాధురితో తాను శారీరకంగా కూడా కలిశానని దువ్వాడ అంగీకరించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. వాణి, ఇద్దరు కుమార్తెలు తనను ఇంటికి కూడా రానివ్వకపోవడంతో మాధురికి దగ్గరయ్యానని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగా కూడా కలిసినట్టు అంగీకరించారు. 


వాణి ప్రచారంతోనే ఈ దుస్థితి: దువ్వాడ


వాణి చేసిన దుష్ప్రచారంతోనే మాధురి ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పారు దువ్వాడ. తాను ఆమెతో ఫోన్‌లో మాట్లాడానని... ఇంకా ఆమె కోలుకుంటోందని వివరించారు. మాధురి పిల్లలకి కూడా డీఎన్ఏ టెస్టులు చేయమని అడగడంతో మరింత డిప్రషన్‌కు గురైందన్నారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధురి ఓవైపు తన అత్తారింటికీ, కన్నవారి ఇంటికి దూరమై ఒంటరిగా మిగిలిందని అన్నారు. ఆమెను తను కూడా దూరం పెడితే తట్టుకోలేదని అందుకే ధైర్యంగా ఉండాలంటూ తాను ఉన్నానని భరోసా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. 


దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి అనే మహిళ ఆదివారం ఆసుపత్రిలో చేరారు. ఆమె కారులో వెళ్తూ వేరే కారును ఢీ కొట్టారు. దీంతో ఆమె నడుపుతున్న కారు బోల్తా పడింది. గాయాల పాలైన ఆమెను పలాస ఆసుపత్రిలో చేర్పించారు. వాణి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను ఆత్మహత్యకు యత్నించినట్టు అక్కడ ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. తనకు ఎలాంటి వైద్యం వద్దని తాను చనిపోవాలనుకుంటున్నానని హడావిడి చేశారు. అయితే పోలీసులు అక్కడుకు వచ్చి ఆమెను వైజాగ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె కోలుకుంటున్నారు.