Jagan To Start Tour Of Districts From Srikakulam: జనవరి నుంచి జిల్లా పర్యటనలు వెళ్లడానికి సిద్ధమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే కేడర్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమవుతున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించనున్నారు జగన్. ప్రతి బుధవారం, గురువారం అక్కడే ఉండి ప్రజలు,పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు గురించి తెలుసుకోనున్నారు.
ఇలా జిల్లా పర్యటనలకు క్షేత్రస్థాయి కేడర్‌ను రెడీ చేస్తున్న జగన్ వారితో వరుస మీటింగ్‌లును ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నేతలతో కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వం పరిపాలనలో ఆరుమాసాల్లోనే విఫలమైందని ప్రజలను ఆదుకునే వారు లేకుండా పోయారన్నారు. అందుకే వరికి అండగా ఉండాలంటూ నేతలు సూచనలు చేశారు.
ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని, కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలేవీ నేరవేర్చడం లేదని జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం అందక కష్టాల్లో ఉన్న రైతులు, విద్యార్థులు, ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరముందని శ్రీకాకుళం జిల్లా కేడర్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంని దిశా నిర్దేశం చేశారు.
జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్న జగన్ నిర్వహించిన కీలక సమావేశానికి జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ్, పేరాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, మెంటాడ పద్మావతి, స్వరూప్‌తోపాటు కేడర్ అంతా హాజరైంది. ఈ భేటీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ ఆయన కుమారుడు కానీ హాజరుకాలేదు. ఇదే అంశం కేడర్‌లో చర్చకు దారి తీసింది. ధర్మానను ఉద్దేశించే జగన్ కొన్ని సెటైర్లు కూడా వేశారని చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. పార్టీ బలోపేతానికి, ప్రజల కోసం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కేడర్ అంతా చీమలదండులా కదలాలి. నిద్రావస్థ నుంచి బయటకు రావాలి. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలమే కానీ నీరు తాగించలేం" అనిఅన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జనవరి మూడో వారంలో "కార్యకర్తలతో జగన్"అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. ఈలోగా జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ కార్యకర్తకు ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలని జగన్ అన్నారు. గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసే దిశగా అడుగులు ముందుకు వేద్దామని పేర్కొ న్నారు. మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నేటికి కూడా వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్తున్నారని గుర్తు చేశారు జగన్. కేవలం వైసీపీ మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా అమలు చేసిందని సగర్వంగా చెప్పగలమన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా ఇప్పటికి భావిస్తున్నామన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో సంక్షేమ కేలండర్‌ను విడుదల చేసి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
Also Read: వైజాగ్ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ కేసు తూచ్ - అందులో డ్రై ఈస్ట్ మాత్రమే ఉందని నిర్దారించిన సీబీఐ
కూటమి మాయమాటలను ప్రజలు నమ్మడం వల్లే ఇబ్బంది వచ్చిందని అయినా 40 శాతం ఓటు షేర్ వచ్చిందన్నారు జగన్. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారనే చేయి అటువైపు పోయిందన్నారు. ఇవాళ చూస్తే పలావు పోయింది... బిర్యానీ కూడా లేదన్నారు. ఇదే మాట ప్రతి ఇంటిలో వినిపిస్తుందని అన్నారు. ప్రజల్లోకి వెళ్తే వాస్తవం తెలుస్తుందని కేడర్‌కు స్పష్టం చేశారు.
ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికీ గర్వంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు జగన్. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లమవుతాయని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..." వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి. వైద్య రంగం కుంటుపడింది. రైతులు పండించిన ధాన్యం కోనుగోలుచేసే నాథుడే లేడు. వ్యవసాయ రంగం కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఇ-క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమాపెట్టాం. దళారీ వ్యవస్థ లేకండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే... ఈరోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు."
రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని జగన్ దుయ్యబట్టారు. ఇసుక రేట్లు రెట్టింపు అయ్యాయన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం మద్యం షాపులు తీసేసి ప్రతి గ్రామంలో బెల్టుషాపులు నడుపుతున్నారని విమర్శించారు. మోసంతో అధికారంలో వచ్చిన కూటమి నేతలు ప్రజల కోపానికి గురికాక తప్పదన్నారు. తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రానిరోజులు చూస్తామన్నారు. మనకు మనంగా చేయికలుపుతుముందుకు వెళ్తామంటు సిక్కోలు సైన్యంలో జోష్ నింపారు. సమావేశానికివెళ్లే కార్యకర్తలు, నాయకులతో జగన్ ఫోటోలో దిగారు.
Also Read: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!