CM Chandrababu Comments In Deeptech Innovation Conclave In Vizag: ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని.. ఏపీ నాలెడ్జ్ హబ్‌గా తయారవుతోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విశాఖలో గురువారం నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌కు (Deeptech Innovation Conclave) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాల్లో మన దేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని అన్నారు. డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. 'పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాం. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవి. కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'అదే కొత్త నినాదం'
ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోంది. రోజురోజుకూ కొత్త మార్పులు వస్తున్నాయి. జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారింది. భారత్‌లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ కీలకంగా మారింది. వాటితోనూ అన్ని పనులూ చేసుకునే పరిస్థితికి వచ్చాం. నదుల అనుసంధానంతో నీటి కొరత అనేదే ఉండదు. ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్ హబ్‌గా ఏపీ మారబోతోంది. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పెట్టుబడులతో వస్తోన్న వారికి రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం.' అని సీఎం తెలిపారు.
పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయడమే కొత్త టార్గెట్ అని సీఎం అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో 15 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జనాభా ఇప్పుడు ఆస్తిగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయని.. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. పాపులేషన్, టెక్నాలజీ ఆధారంగా గ్లోబల్ హబ్‌గా ఇండియా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అటు, వ్యవసాయ రంగంలో ఏపీ ముందుందని.. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు టెక్నాలజీని అనుసంధానం చేసి మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఐ, ఎంఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు ఉన్నారు.
Also Read: YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు