Currency Notes In Rajya Sabha: పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament winter session).. ఒకవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ(Goutam Adani) వ్యవహారం, మణిపూర్(Manipur) అల్లర్లు, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చోటు చేసుకున్న కాల్పులు.. అనంతర పరిణామాలపై చర్చలకు విపక్షాలు పట్టుబడుతుండడంతో సభల్లో వాయిదా పర్వం చోటు చేసుకుంటోంది. ఇక, తాజాగా అగ్నికి ఆజ్యం పోసినట్టు పెద్దల సభ రాజ్యసభలో నోట్ల కట్టలు(Currency Bundles) లభించడం మరింత వివాదానికి దారి తీసింది.
గురువారం సభను వాయిదావేసిన తర్వాత.. సిబ్బంది ఛాంబర్‌ను తనిఖీ చేసినప్పుడు.. ఓ సీటు వద్ద రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించాయని శుక్రవారం(Friday) ఉదయం సభ ప్రారంభం అవుతూనే.. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) వెల్లడించారు. ఇవి.. 222వ సీటు వద్ద లభించాయని పేర్కొన్నారు. ఈ సీటును తాను కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ(Abhishek manu singhvi)కి కేటాయించానని తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే విచారణ కు ఆదేశించినట్టు జగదీప్ ధన్ ఖడ్ స్పష్టం చేశారు.
తీవ్ర దుమారం..
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన ప్రకటనతో సభలో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యుల(Opposition) నుంచి నిరసన వ్యక్తమైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నోట్ల కట్టలు వెలుగు చూడడంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అధికార బీజేపీ సభ్యులు(BJP) డిమాండ్ చేయడంతోపాటు..చైర్మన్ చేసిన వ్యాఖ్యలను వారు సమర్థించారు. కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు మాత్రం చైర్మన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విచారణ పూర్తి కాకుండానే ఒక సభ్యుడి పేరును ఎలా ప్రస్తావిస్తారని.. రాజ్యసభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) నిప్పులు చెరిగారు. అయితే.. విచారణకు తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగింది?
శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం కూడా.. విపక్ష సభ్యులు.. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ.. సభలో హంగామా చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలను సరిదిద్దేందుకు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్(Jagdeep Dhankhar) ప్రయత్నించినా.. ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో సభను వాయిదా వేశారు. అనంతరం.. సాధారణ విధుల్లో భాగంగా భద్రతా సిబ్బంది సభ్యులు వెళ్లిపోయిన తర్వాత.. సభను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వారికి 222వ నెంబరు సీటు వద్ద... రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించాయని పేర్కొంటూ.. రాజ్యసభ సచివాలయానికి సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar)కు సమాచారం చేరింది. దీంతో చైర్మన్ వెంటనే దీనిపై విచారణ కు ఆదేశించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులకు వివరించారు. అయితే.. ``ఆ సీటును కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాం`` అని చైర్మన్ వెల్లడించడం వివాదానికి దారితీసింది.
విపక్షం ఆందోళన..
సభలో నోట్ల కట్టలు లభించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Malli karjuna Kharge) వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కానీ, చైర్మన్ నేరుగా తమ సభ్యుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. దర్యాప్తు పూర్తి కాకుండానే.. ఒక సభ్యుడి పేరును చైర్మన్ చెప్పడం ఏంటని నిలదీశారు.
అధికార పక్షం మాట ఇదీ..
అధికార బీజేపీ పక్ష నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kirenrijuju) స్పందిస్తూ.. ఖర్గేకు కౌంటరు ఇచ్చారు. ‘‘పేరు చెబితే తప్పేంటీ? ఏ సీటు వద్ద నగదు దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం మంచిది కాదు. దీనిపై విచారణ జరిగి తీరాల్సిందే`` అన్నారు. మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) స్పందిస్తూ.. ఇలా నోట్ల కట్టలు లభించడం.. రాజ్యసభ సమగ్రతను అవమానించడమేనన్నారు.
నేను తెచ్చింది ఒక్క నోటే!
ఈ పరిణామాలపై 222వ నెంబరు కూర్చునే కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. తాను తెచ్చింది రూ.500 ఒక్క నోటేనని తెలిపారు. అది కూడా తన జేబులోనే ఉందన్నారు. అయితే.. ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ తనపై రాలేదన్న ఆయన.. విచారణ జరపడం తప్పుకాదన్నారు. గురువారం రాజ్యసభకు వచ్చేప్పుడు తన దగ్గర కేవలం 500 నోటు ఒక్కటే ఉందని, సభ వాయి దాపడిన తర్వాత.. తాను క్యాంటీన్‌కు వెళ్లానని.. మధ్యాహ్నం.. 1.30 తర్వాత సభ నుంచి బయటకు వెళ్లిపోయానని సోషల్ మీడియా `ఎక్స్`లో పోస్టు చేశారు.