RBI MPC December Meeting Decisions: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), బెంచ్ మార్క్ వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) కీలకమైన రెపో రేటును (Repo Rate) 6.50 శాతం వద్దే కొనసాగించింది, ఈసారి కూడా దానిని మార్చలేదు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు, రెపో రేట్ సహా కీలక రేట్లలో 'యథాతథ స్థితి కొనసాగింపు'నకు ఓటేయగా, ఒక్కరు మాత్రం వాటిని మార్చాలని ఓటేశారు. దీంతో, కీలక రేట్లలో పూర్వ స్థితినే కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా 11వసారి. RBI MPC చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను మార్చింది, అప్పటి నుంచి రెపో రేటు 6.50 శాతం వద్దే కొనసాగింది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
MSF, SDF రేట్లు
కేంద్ర బ్యాంక్ నిర్ణయించే కీలక రేట్లలో, రెపో రేట్‌తో పాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్లు కూడా ఉంటాయి. వీటిపైనా యథాతథ స్థితిని కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.75 శాతంగా, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6.25 శాతంగా ఉన్నాయి, ఇకపైనా ఇవే కొనసాగుతాయి.
"స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు & అంచనాల తర్వాత, ద్రవ్య విధాన కమిటీ, పాలసీ రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. తత్ఫలితంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25 శాతం వద్ద అలాగే ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతంగా ఉన్నాయి - ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
రుణగ్రహీతలకు ఈసారీ నిరాశే.,
రెపో రేటును తగ్గిస్తారని, ఫలితంగా బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు, EMIల భారం తగ్గుతాయని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. కానీ, వరుసగా 11వ సారి కూడా ఆర్‌బీఐ రుణగ్రహీతల ఆశలపై నీళ్లు చల్లింది.
ద్రవ్య విధానం (Monetary Policy)
సమాజంలోని ప్రతి వర్గానికి ధరల స్థిరత్వం ముఖ్యమని గవర్నర్ చెప్పారు. MPC సమావేశానికి అధ్యక్షత వహించిన దాస్, 'వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధానాల'పై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టిందని వివరించారు. "అధిక ద్రవ్యోల్బణం ప్రజల చేతిలోని ఖర్చు చేయగల ఆదాయాన్ని తగ్గిస్తుంది, ఇది GDP వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది" అని గవర్నర్ చెప్పారు. ఆర్థిక మార్కెట్ అస్థిరత, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు, విపరీతమైన వాతావరణ మార్పులు, ప్రకృతి ప్రకోపాలు ఆర్థిక వృద్ధికి కీలకమైన నిరోధాలని స్పష్టం చేశారు.
జీడీపీ అంచనా (GDP Projection)
స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు & అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY 2024-25 లేదా FY25) దేశాభివృద్ధి అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. FY25లో GDP వృద్ధి రేటు అంచనాను 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది.
ద్రవ్యోల్బణం (Inflation)
దేశంలో ఆహార ధరల్లో పెరుగుదలను ప్రస్తావించిన సెంట్రల్ బ్యాంక్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (retail inflation) అంచనాను 4.8 శాతానికి పెంచింది. మునుపటి MPC సమావేశంలో ఈ అంచనా 4.5 శాతంగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, తగ్గిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ