YSR Vahana Mitra: వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం 2022–23 లబ్ధిదారులకు శుభవార్త. ఈ పథకం కింద చేసే ఆర్థిక సాయాన్ని రేపు (జూన్ 15) సీఎం జగన్ చేయనున్నారు. ముఖ్యమంత్రి విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర (YSR Vahana Mitra) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు నాలుగో విడతగా వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థియసాయాన్ని అందజేయనున్నారు. 


2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌‌లు ఉన్న దాదాపు 2,61,516 మంది అర్హులైన డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకు ఈ ఏడాది అంటే నాలుగో విడతలో రూ.261.51 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. 


ఇప్పటివరకు మూడుసార్లు (2019–20, 2020–21, 2021–22) వైఎస్ఆర్‌ వాహనమిత్ర (YSR Vahana Mitra) పథకం కింద ఆర్థిక సహాయం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది.


వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ మంది వాహన మిత్ర (YSR Vahana Mitra) పథకం కింద సాయం అందుకోనున్నారు. 2022–23కు గాను అర్హత గల సొంత వాహనదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ సంవత్సరం మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం ఈ సాయాన్ని అందించనున్నారు. మొత్తం 2,61,516 మంది లబ్దిదారుల్లో బీసీలు 1,44,164 ఉండగా, ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


దరఖాస్తు ఎలా అంటే..
ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తి తమ వాహనం పక్కనే ఫొటో దిగాలి. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయంలో దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు అయితే, ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, భూ పాస్ బుక్కు, ఐటీ, ఇంటి కరెంటు బిల్లు, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలను ఫైల్ చేసి అప్లై చేసుకోవాలి. ఈ దరఖాస్తులను 6 అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.


వీరు అర్హులు కారు
ఆదాయ పన్ను చెల్లించేవారు, ఇంటికి వచ్చే కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లకు మించని వారు అర్హులుగా నిర్దేశించారు. అలాగే మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకుపైగా ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు పైగా స్థలం ఉన్నవారు, వేరొక పథకంలో ప్రయోజనం పొందిన వారు ఈ పథకానికి అర్హులుగా పరిగణించరు.