కోవిడ్ సమయంలో దెబ్బతిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్‌లో సందడి మొదలైంది. రాకపోకలు మళ్ళీ మునుపటి స్థాయిలో పెరిగాయి. రోజురోజుకూ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది అని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. 2021-22 లో విమాన సర్వీసుల సంఖ్య 2,482 గా ఉంటే, 2022-23 సీజన్ కోసం ఇప్పటికే 5,313 సర్వీసులు రెడీ అయ్యాయి.


2021-22 లో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 2,21,980 అయితే 2022-23 సీజన్ కోసం ఇప్పటికే బుక్ చేసిన వారితో కలిపి 5,94,400 మంది వైజాగ్ నుంచి రాకపోకలు సాగించనున్నారు. సరకు రవాణా సైతం 10 శాతం పెరిగింది అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కోవిడ‌్‌కు ముందు ప్రతీ నెల రెండున్నర లక్షల మంది వరకూ ప్రయాణికులు వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ స్థాయిని మళ్లీ అందుకుంటుంది వైజాగ్ ఎయిర్పోర్ట్.


కోవిడ్  ఆంక్షలు ఎత్తివేయడంతో, విమాన సర్వీసులు పెంచడం వంటి చర్యలతో వైజాగ్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే, స్వదేశీ, విదేశీ విమానాల సర్వీసులు విశాఖకు రానున్నాయి. దానితో అతి త్వరలోనే మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ రోజుకి రెండున్నర లక్షల  ప్రయాణాలు నడిపించే స్థాయికి చేరుకుంటుంది అని అధికారులు లెక్కలు వేస్తున్నారు.


సరకు రవాణా పరంగానూ వైజాగ్ ఎయిర్పోర్ట్ పురోగతిలో ఉందని అంటున్నారు అధికారులు. 2021-22 క్వార్టర్లో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి 1,184 టన్నుల సరుకు రవాణా జరిగితే , ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో 1,302 టన్నులకు పెరిగింది. అంటే 10 శాతం పెరుగుదల కనిపిస్తుంది. 


ఓమిక్రాన్ భయం లేకుంటే ఈ సంఖ్య మరింత పెరిగేది : ఎయిర్పోర్ట్ అధికారులు


వైజాగ్ ఎయిర్ పోర్ట్ మళ్ళీ కోవిడ్ మునుపటి స్థితికి చేరుకుంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భయం తగ్గిపోవడం తో ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్న అఫీషియల్స్ జనవరి నుంచి మార్చి మధ్యలో ఓమిక్రాన్ భయం లేకుంటే ఈ సంఖ్య మరింత పెరిగేది అంటున్నారు. గత ఏడాది క్యూ -1 తో పోల్చుకుంటే ఈ ఏడాది క్యూ -1 లో బుక్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా  168 శాతం ఉందని.. ఇది చాలా మంచి పరిణామం అని అధికారులు చెబుతున్నారు.


శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య మరింత పెరగనున్న వేళ వైజాగ్ ఎయిర్పోర్ట్ లాభాల్లో దూసుకుపోవడం ఖాయం అంటూ ఊహల్లో తేలిపోతున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. మరి వారి అంచనాలు ఎంతవరకూ నిజమవుతాయో  చూడాలి.